- పెద్దఎత్తున బ్లాక్ చేయడంపై ఆందోళన
గుంటూరు: జిల్లాలో బదిలీలకు సంబంధించి పాఠశాలల వారీగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వచ్చింది. మండలాల వారీగా ఎంఈఓలు గతంలో పాఠశాలల నుంచి వచ్చిన ఖాళీల జాబితాను ఇంతకు ముందే ఒకసారి పరిశీలించగా అందులో కొన్ని తప్పిదాలు ఉండడంతో వాటిని సరిచేయడానికి కొంత సమయం తీసుకున్నారు. వాటిపై తుది పరిశీలన చేసి జిల్లా విద్యాశాఖ ఆ జాబితాను ధ్రువీకరిస్తూ అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు సంబంధించి 2415 ఖాళీలు ఉన్నాయని తేల్చింది. వాటిల్లో కౌన్సెలింగ్‌కు 1640 ఖాళీలు మాత్రమే చూపించేలా ఆ జాబితాకు తుది రూపమిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 775 ఖాళీలను బ్లాక్ చేసింది. ఇది తెలుసుకుని ఉపాధ్యాయవర్గం లబోదిబోమంటోంది.
ప్రవేశాలు పెరిగినా టీచర్లు ఏరీ? : ప్రస్తుత విద్యా సంవత్సరంలో జగనన్న విద్యాకానుక, నాడు-నేడు పనులతో సర్కారీ పాఠశాలల స్వరూపం మారడంతో చాలా మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 26వేల మంది విద్యార్థులు ఈ ఏడాది కొత్తగా చేరారు. దీంతో అనేక పాఠశాలల్లో పిల్లల ప్రవేశాలు పెరిగాయి. హేతుబద్ధీకరణలో భాగంగా చాలా పాఠశాలల్లో పెరిగిన పిల్లల వల్ల పోస్టుల్లో కోతపడలేదనే అభిప్రాయం సాక్షాత్తు యంత్రాంగం నుంచే వచ్చింది. పిల్లల పెరుగుదల నేపథ్యంలో అవసరమైన పాఠశాలలకు అదనపు టీచర్లను ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా చాలా పాఠశాలల్లో బ్లాక్ చేసిన ఖాళీలు ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొల్లిపర మండలం చక్రాయపాలెం ఎలిమెంటరీ పాఠశాలలో ప్రస్తుతం 73 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. 60 మంది పిల్లల కన్నా ఎక్కువగా ఉంటే అదనంగా ఒక టీచర్‌ను ఇవ్వాలి. ఈ ప్రకారం చూస్తే సదరు పాఠశాలకు ఒక టీచర్ అదనంగా రావాలి. ప్రస్తుతం చూపిన జాబితాలో ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒక టీచర్‌కు 8 ఏళ్లు సర్వీసు ముగిసిందని చెప్పి తప్పనిసరి ఖాళీల జాబితాలో చూపారు. ఆ పాఠశాల నుంచి ఆ టీచర్ బదిలీపై వెళితే మిగిలేది ఒక్కరే. అదనంగా పిల్లలు చేరారని మరో టీచర్‌ను అదనంగా కేటాయించలేదు. ఉన్న ఇద్దరిలో ఒకరు లాంగ్ స్టాండింగ్ కింద బదిలీ అవుతారు. మిగిలిన ఒక్కరితో పాఠశాల ఎలా నడపాలని అక్కడి ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి సమస్య తెనాలి, నరసరావుపేట డివిజన్లలో బాగా ఉందని, ఇవన్నీ పరిశీలించి మరోసారి జాబితాను తిరిగి ప్రదర్శించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇంతకుముందే ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపి ఖాళీలను బ్లాక్ చేయడం లేదని స్పష్టం చేశారు. తీరా ఇప్పుడు ఒక్క గుంటూరు జిల్లాలోనే 775 ఖాళీలు బ్లాక్ చేసి చూపారని, ఇదేం విధానమని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా నేత బసవలింగారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఖాళీలను బ్లాక్ జాబితా నుంచి తొలిగించి కౌన్సెలింగ్ ఖాళీల్లో చూపాలని లేదంటే మిగిలిన సంఘాల నేతలతో కలిపి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
CLARITY ON VACANCIES
West godawari Telugu sa vecencics