- ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా
- ఆర్నెళ్ల నుంచి ఊరిస్తున్న ప్రక్రియ
- వితంతు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక రుగ్మత, రెండేళ్ల సర్వీస్ ఉన్న వారికి మినహాయింపు
- వచ్చే నెల 24 కల్లా కొత్త స్థానాల్లోకి టీచర్లు
కాకినాడ, న్యూస్ టోన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. ఆర్నెళ్ల నుంచి టీచర్లను ఊరిస్తున్న ప్రక్రియకు మోక్షం లభించింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జీవో నెం.59 జారీ చేసింది. నిబంధనల మేరకు వితంతు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు, రెండేళ్ల సర్వీస్ ఉన్న వారికి బదిలీల్లో మినహాయింపు లభించింది. బదిలీలన్నీ అమరావతినుంచి పాఠశాల విద్య కమిషనరేట్ కార్యాలయంనుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. వచ్చేనెల 24కల్లా బదిలీ అయిన వారు కొత్త స్థానాల్లో చేరనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇదే సమయంలో కొవిడ్ ఉధృతమవ్వడంతో రెండు దఫాలు బదిలీలు వాయిదా వేశారు. గతంలో ఆన్‌లైన్ ద్వారా బదిలీకి దరఖాస్తు చేసిన ఉపాధ్యాయుల జాబితా ప్రాథమిక విద్యశాఖ కమిషనరేట్ నుంచి జిల్లా విద్యాశాఖకు వచ్చింది. దాని ఆధారంగా డీఈవో కార్యాలయ సిబ్బంది దరఖాస్తులను పునఃపరిశీలించి తుది పరిశీలన చేసి ఇటీవల సదరు జాబితా అమరావతికి పంపారు. జిల్లాలో అన్ని కేటగిరీల్లో 14,300 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకేచోట ఎనిమిదేళ్లు పనిచేసిన ఉపాధ్యాయులందరూ బదిలీకి అర్హులయ్యారు. ఇప్పుడు జరుగుతున్న బదిలీల్లో 7,425మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,127మంది తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్నారు. మిగిలిన వారికి రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్‌లకు అవకాశమిచ్చారు.
ఏజెన్సీలో పనిచేయాల్సిందే..
ఇప్పటివరకు జిల్లాలో పలు విడతల్లో జరిగిన టీచర్ల బదిలీల్లో అధికశాతం మంది ప్లెయిన్ ఏరియాల్లోనే బదిలీ అయ్యేవారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా 2017లో జరిగిన బదిలీల్లో చాలామంది ఏజెన్సీకి బదిలీపై వెళ్లలేదు. దీంతో సబ్‌ప్లెయిన్, రిమోట్ ప్రాంతాల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తోంది. ఈ సారి వారు చేసిన సర్వీస్ సీనియార్టీ ప్రకారం ఆన్‌లైన్‌లో బేరీజు వేసి, అటువంటి వారిని ఏజెన్సీకి బదిలీ చేయాలని ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. దీంతో ఏజెన్సీ ముఖం చూడని వారు తప్పని పరిస్థితిలో అక్కడ పనిచేయాల్సి ఉంటుంది.
ఇదీ షెడ్యూల్
అమరావతి నుంచి వచ్చిన బదిలీ జాబితా దరఖాస్తులను ఈ నెల 28, 29 తేదీల్లో డీఈవో కార్యాలయంలో పరిశీలిస్తారు. ఉపాధ్యాయులకు వచ్చిన సర్వీస్ పాయింట్‌ల ఆధారంగా ప్రొవిజనల్ సీనియార్టీ జాబితాను ఈనెల 30 నుంచి డిసెంబరు 2 వరకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. సదరు జాబితాపై అభ్యంతరాలుంటే డిసెంబరు 3, 4 తేదీల్లో డీఈవో కార్యాలయంలో లిఖితపూర్వకంగా, సంబంధిత డాక్యుమెంట్‌లతో పరిష్కరించుకోవడానికి గడువు ఇచ్చారు. అనంతరం సిద్ధం చేసిన జాబితాను జేసీకి నివేదిస్తారు. దీనిపై జేసీ 5, 6, 7 తేదీల్లో పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పాయింట్ల ఆధారంగా డిసెంబరు 8, 9, 10 తేదీల్లో సీనియార్టీ జాబితా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 11 నుంచి 15 వరకు బదిలీకి దరఖాస్తు చేసిన వారు వెబ్ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారు. 16 నుంచి 21 వరకు బదిలీ ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 22, 23 తేదీల్లో బదిలీ ఉత్తర్వుల్లో సాంకేతిక అవరోధాలుంటే వాటిని పరిష్కరిస్తారు. డిసెంబరు 24న బదిలీ ఉత్తర్వులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.