- నేటి నుంచి ఇంటింటి సర్వే
సత్తెనపల్లి: పాఠశాలలు ప్రారంభమై పక్షం రోజులు కావస్తున్నా 9, 10 తరగతుల విద్యార్థుల హాజరు అత్యంత తక్కువగా ఉండడంపై విద్యాశాఖ అంతర్మథనంలో ఉంది. కొవిడ్ వ్యాప్తి చెందకుండా బడుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా అభ్యసనకు ఎందుకు విద్యార్థులు రావట్లేదని తెలుసుకునే ప్రయత్నం చేయబోతోంది. ఈ నెల 2వ తేదీ నుంచి జిల్లాలో ఉన్నత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తొమ్మిదో తరగతి విద్యార్థులు 67,232 మంది, పదో తరగతి విద్యార్థులు 63,955 మంది బడులకు రావాల్సి ఉన్నా 30 శాతం మంది కూడా రావట్లేదు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని బడుల్లోనూ రెండు తరగతుల పిల్లల హాజరు తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బడిమొఖం ఇప్పటివరకు చూడని వేలాదిమంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కారణాలు తెలుసుకునే సర్వేను శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా చేపట్టనున్నారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడే బాధ్యతను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించారు. వారు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులతో మాట్లాడి బడులకు హాజరయ్యేలా చూడనున్నారు.