అమరావతి, న్యూస్ టోన్: ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా లాక్ డౌన్లో విధించిన 50 శాతం బకాయిలను రెండు విడతల్లోనే చెల్లించేందుకు ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు 50 శాతం, పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతంలో 50 శాతం ప్రభుత్వం తగ్గించింది. దీన్ని మూడు విడతలుగా డిసెంబర్ నెల జీతాలతో కలిపి చెల్లిస్తామని ఇంతకు ముందు ప్రకటించింది. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులకు రెండు వాయిదాలు, పెన్షనర్లకు ఒకే విడత చెల్లించేందుకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకారం 50 శాతం బకాయిలు డిసెంబర్ నెల్లో, మరో 50 శాతం వచ్చే జనవరిలో చెల్లించనున్నారు. అదే విధంగా ఉద్యోగుల కరవు బత్యంను పెంచేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది ప్రస్తుతం చెల్లిస్తున్న కరవు బత్యం 27.248 కాగా దీన్ని 30.392 అంటే 3.144 శాతం పెంపుతో అందించాలని నిర్ణయించింది. నెల ముందుగానే బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పట్ల ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వైవీ రావు హర్షం వ్యక్తం చేశారు ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై సత్వరమే స్పందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
DIFFERED SALARIES IN 2 INSTALLMENTS