ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 2 :ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెలలో రెండో యూనిట్ పరీక్షలు, జనవరిలో అర్ధ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మణేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఇంటర్ విద్య బోర్డు వార్షిక తాత్కాలిక క్యాలెండర్ను విడుదల చేసింది. కళాశాలల వెసులుబాటును బట్టి మూడు, నాలుగు యూనిట్ పరీక్షలు నిర్వహించు కోవచ్చు. ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో జరుగుతాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండో శనివారం సెలవులు ఉండవు. సీనియర్ ఇంటర్ విద్యార్థులకు మార్చి మొదటి వారంలో ప్రాక్టికల్ పరీక్షలు, చివరి వారంలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సరం ఇంటర్ అడ్మిషన్లు, తరగతుల నిర్వహణపై ఇంత వరకూ స్పష్టత లేదు. తరగతికి అనుమతించిన అడ్మిషన్ల సంఖ్యపై ప్రభుత్వం, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయ వివాదం తేలే వరకూ అడ్మిషన్లు, తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో తరగతులు జరుగుతుండగా వీలైనంత మేర ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
INTER PUBLIC EXAMS IN MARCH