- శిక్షణ, ఉపకార వేతనాల చెల్లింపులు అంతంతే
- 2015-18 మధ్య కాగ్ పరిశీలనలో వెల్లడి
న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలోని చాలా పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో బోధన, శిక్షణ, సదుపాయాల కల్పనలో నాణ్యత కొరవడినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. చాలా సంస్థల్లో అధునాతన పరికరాలు లేకపోగా.. ఉన్నవాటి నిర్వహణకూ నిధులు విడుదల చేయలేదని వెల్లడించింది. గుంటూరు, తిరుపతిలోని జిల్లా స్థాయి శిక్షణ కేంద్రాలతోపాటు నెల్లూరు, ఒంగోలు, బి.తాండ్రపాడు, కడప, అరకు, పాయకరావుపేట, ఏలూరు, విజయవాడ ఐటీఐల్లో 2015-18 మధ్య నిర్వహణ తీరును కాగ్ తనిఖీ చేసింది. ఆ వివరాలను తాజాగా వెల్లడించింది.
ఒక్కో విద్యార్థికి శిక్షణ గ్రాంటును ఇంజినీరింగ్ ట్రేడులకు రూ.400, ఇతరులకు రూ.300ల చొప్పున ఎనిమిది ఐటీఐలకు రూ.3.22 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా రూ.27.51 లక్షలే మంజూరు చేసింది. బి.తాండ్రపాడు ఐటీఐకి మాత్రమే పాక్షికంగా ఉపకార వేతనాలు ఇచ్చింది. తనిఖీ చేసిన ఏడింటిలోనూ పరికరాల కొరత ఉంది.
ప్రపంచ బ్యాంకు సహాయక వృత్తివిద్యా శిక్షణ, అభివృద్ధి ప్రాజెక్టు కింద ఉన్న కడప డీఎల్‌టీసీలో రూ.1.08 కోట్ల విలువైన పరికరాల కొనుగోలు టెండర్లలో నిబంధనలు పాటించలేదు.
8 ఐటీఐల్లో 179 మంది బోధకుల పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన 92 మంది పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం రూ.14,000 ఇవ్వాలి ఉన్నా రూ.7 వేలు-రూ.12 వేల చెల్లిస్తున్నారు.
విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ ఇప్పించడంలో చొరవలేదు. కేంద్రం కేటాయించిన నిధుల సకాలంలో వినియోగించలేదు.
NO QUALITY IN ITI TRAINING -CAG