- ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఈ నెలలో ఇంటింటి సర్వే
న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో వివరాల సేకరణకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రయోగాత్మకంగా మంగళగిరి, తాడేపల్లిలో ఇప్పటికే సర్వే నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో చేపట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, గ్రామ, వార్డు సచివాలయ విద్య, సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరు వాలంటీర్లకు తర్ఫీదు ఇస్తారు. ఈ-ప్రగతి విభాగంతో కలిసి ఈ సర్వే చేస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలో ట్యాబ్ ద్వారా వివరాలను సేకరించనున్నారు. సర్వే పూర్తయ్యాక విశ్లేషించి, నివేదిక రూపొందించనున్నారు.
చదువు ఎందుకు ఆపేస్తున్నారు
ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఈఆర్) చాలా తక్కువగా నమోదవుతోంది. కొన్నేళ్లుగా ఇందులో మార్పు ఉండటం లేదు. ‘అఖిల భారత ఉన్నత విద్య సర్వే’ ఏటా గణాంకాల్ని విడుదల చేస్తోంది. జాతీయస్థాయితో పోలిస్తే మెరుగ్గా ఉన్నా అనుకున్న స్థాయిలో ఉన్నత విద్యలో ప్రవేశాలు ఉండటం లేదు. రాష్ట్రంలో 32.4 శాతం మందే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో మహిళలు తక్కువ. ఎంతమంది ఎక్కడి దాకా చదువుకున్నారు? ఆపేయడానికి గల కారణాల్ని ఇంటింటి సర్వే ద్వారా గుర్తించనున్నారు. సర్వేలో సేకరించిన డేటాను అన్ని శాఖలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఏం చదువుకున్నారనే వివరాలు సేకరిస్తారు. ఆధార్, ఫోన్ నంబర్లు సహా వీటిని తీసుకుంటారు కాబట్టి సర్వేలో తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదు. బడి మధ్యలో మానేస్తున్న వారు.. ఇంటర్ తర్వాత చదువు నిలిపివేస్తున్న వారు.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారు.. ఇలా అందరి వివరాలు సేకరిస్తారు. 19 అంశాలకు సంబంధించి వివరాలు అడుగుతారు.
SURVEY ON HIGHER EDUCATION