- శాసనమండలిలో తెదేపా, పీడీఎఫ్ సభ్యుల ధ్వజం
- సీపీఎస్ రద్దుపై కేఏ పండిట్ కమిటీతో వాస్తవిక విశ్లేషణ: మంత్రి బుగ్గన వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. 18 నెలలైనా ఎందుకు చేయలేకపోయారు? పాత డీఏలను 30 నెలల తర్వాత జీతంలో కలిపి ఇస్తామంటారా? ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రజాస్వామికంగా వ్యవహరించలేరా? ఒక్కసారి కూడా సమస్యలపై చర్చించి పరిష్కరించలేరా?’ అని తెదేపా, పీడీఎఫ్ సభ్యులు శాసనమండలిలో ధ్వజమెత్తారు. ‘ఉద్యోగుల సంక్షేమం- ప్రభుత్వ విధానం’ అంశంపై గురువారం మండలిలో లఘుచర్చ జరిగింది. ఈ సందర్భంగా పీడీఎఫ్ సభ్యుడు ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఉద్యోగుల అసంతృప్తి వ్యతిరేకతగా మారకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శాంతియుత నిరసనలు తెలిపేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాలను అనుమతించడం లేదని.. నిరసన తెలిపే హక్కును అణచివేయొద్దని హెచ్చరించారు. ఉపాధ్యాయులతో నాడు-నేడు పనులు చేయించటం దారుణమని తెదేపా సభ్యుడు ఏఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. పాఠశాలలు తెరవటం వల్లే అనేక మంది ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ప్రజాస్వామికంగా మెలగాలని, లేకపోతే ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని పీడీఎఫ్ సభ్యుడు విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు.
వర్కింగ్ కమిటీని నియమించాం
సీపీఎస్ రద్దుకు సంబంధించిన అంశంపై కేఏ పండిట్ కమిటీ వాస్తవిక విశ్లేషణ జరుపుతోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వర్కింగ్ కమిటీని నియమించామన్నారు. ప్రస్తుతం వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. సీపీఎస్ రద్దుకు సంబంధించి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. శాసనమండలిలో ‘ఉద్యోగుల సంక్షేమం- ప్రభుత్వ విధానం’ అంశంపై జరిగిన లఘుచర్చకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం కరోనా వల్ల రాబడి పడిపోయిందని, ఉద్యోగుల సంక్షేమంలోనూ తొలుత చిరుద్యోగులకే ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. ఆ క్రమంలోనే ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డులకు వేతనాలు పెంచామని తెలిపారు.
WHY CPS NOT ABOLISHED