Harsha vardhan on covid-19 cases: ఇటీవల కాలంలో దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సోమవారం నాడు స్పందించారు. కరోనా మహామ్మరి పట్ల నిర్లక్ష్యం పెరగడం ప్రధాన కారణమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సోమవారం అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడమే కేసులు పెరగడానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ లభించినప్పటికీ, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కేసులు మరోసారి విజృంభిస్తోందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు హౌస్ అనెక్స్‌లో పార్లమెంటు సభ్యుల కోసం ఏర్పాటు చేసిన సూపర్ స్పెషలిస్ట్ మెగా హెల్త్ క్యాంప్ సందర్భంగా హర్షవర్ధన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ శిబిరాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోగ్య మంత్రి సమక్షంలో ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఏడాది పొడవునా పార్లమెంట్ హౌస్ అనెక్స్ కేంద్రంలో వైద్య, ఆరోగ్య సదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయోగశాల పరిశోధనలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు వివిధ ప్రత్యేకతల నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. సాధారణ సేవలతో పాటు, పార్లమెంటు సభ్యులకు కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీతో సహా ప్రత్యేకమైన సూపర్ స్పెషలిస్ట్ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆయుష్ సేవలు, పోషక సేవలను కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
‘దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న రోజువారి కేసుల్లో 80% ఆ ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. దీనికి కారణం ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడమే’ అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే..కరోనాపై పోరులో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే అనేక అంశాల్లో మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు. గత ఏడాదిగా కరోనా విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారని, భవిష్యత్తులోనూ ఇదే వైఖరిని కొనసాగించాలని ఆయన సూచించారు.
ఇదిలావుంటే, ప్రజలలో అవగాహన పెంచడం ద్వారా కోవిడ్ టీకా డ్రైవ్‌ను జాన్ ఆండోలన్ (ప్రజల ఉద్యమం) గా మార్చాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం టీకా మోతాదు 3 కోట్లకు చేరుకుంటుందని, టీకా డ్రైవ్ వేగంగా జరుగుతోందని హర్షవర్ధన్ తెలిపారు.