మావాడు భలే తెలివైన వాడండి. ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ వరకు ప్రతి చోటా క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ప్రముఖ ఎమ్మెన్సీ కంపెనీలో ఐదంకెల జీతంతో ఉద్యోగం సంపాదించాడు. కానీ కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాక ఎందుకో డల్‌గా అయ్యాడు. ఇంతా సాధించాక వాడు ఇంకా ఎందుకు దిగులుపడుతున్నాడో అర్థం కావడం లేదంటూ వెంకట్‌తో రామ్ వాపోయాడు. ఇదొక్క రామ్ సమస్యనే కాదు చాలా మందికి ఎదురవుతున్న సమస్య. పుస్తకాల్లో చదవి, పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్లే తెలివిగలవాళ్లు అనుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. పుస్తకాల్లో ఉన్నది చదవి గుర్తుపెట్టుకుని పరీక్షలో రాయడం జ్ఞాపకశక్తికి నిదర్శనం. చిక్కుముడులు విప్పడం అనేది మానసిక పరిణతికి సంబంధించింది. జ్ఞాపకశక్తి వల్ల గుర్తింపు మాత్రమే రావచ్చు. కానీ, సమయానుకూలంగా తెలివితేటలను ఉపయోగించడం వల్ల జీవితంలోనూ, కెరీర్ పరంగానూ పై స్థాయిలో ఉండవచ్చు.
అసలు ఎమోషనల్ ఇంటలిజెన్స్ అంటే: మీలోని, మీచుట్టూ ఉన్న వారి భావోద్వేగాలను గుర్తించడం, దాని వల్ల ప్రవర్తనలో కలిగే మార్పులను గమనించి తెలివిగా ప్రవర్తించడమే ఎమోషనల్ ఇంటలిజెన్స్. ఉదాహరణకు మీరు ఓ కంపెనీకి ఓనర్ అనుకుంటే మీకు ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఉంటే మీ ఉద్యోగుల ప్రవర్తనను ముందుగా అంచనా వేస్తారు, వారి క్రియేటివిటీని ఎలా వాడుకోవాలి, దాని సాయంతో కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో తెలుస్తుంది.
ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఏ అంశాలతో ముడిపడి ఉంటుందంటే..
స్వీయ అవగాహన(Self-awareness):
మీ గురించి మీరు తెలుసుకోవడం, మీ గోల్స్, ఫీలింగ్స్, అవసరాలు, మీ బలాలు, బలహీనతలు ఇలా అన్నింటి గురించి అవగాహన ఉండటం. వీటన్నింటినీ ఆధారం చేసుకొని మీరు పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించడం
ప్రేరణ (Motivation):
మీ గురించి మీకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మీరు స్వయంగా మోటివేట్ అవుతారు. అదే సమయంలో పక్కవారికీ మీరు ప్రేరణనిస్తారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication skills):
మీ గురించి, మీ పక్కవారి ఎమోషన్స్ మీద మీకు అవగాహన వచ్చినప్పుడు మీరు అవతలి వారితో చాలా ఈజీగా కమ్యునికేట్ చేయగలరు.
స్వీయ నియంత్రణ (Self-controlling):
రకరకాల ఎమోషన్స్ మీద మీరు నియంత్రణ కలిగి ఉండటం ఎంతో కీలకం. కొన్ని ఎమోషన్స్‌కు బాధితులుగా మారకుండా ఉండటమనేది చాలా ముఖ్యమైన అంశం.
సామాజిక సామర్థ్యం (Social Competence):
సమాజంలోని వివిధ వర్గాలు, వ్యక్తులతో మీరు సత్సంబంధాలు కలిగి ఉండటం. (ఉదాహరణకు ఓ ఉద్యోగి ఇంట్లో ఏదో సమస్య వల్ల రోజూ ఆఫీసుకు ఆలస్యంగా వస్తున్నాడని అనుకుందాం. దీంతో అతడి బాస్ అతడి మీద అరవడం మామూలుగా జరిగేదే. అయితే దీనిని ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఉన్న బాస్ అయితే ఎలా డీల్ చేస్తారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ బాస్ సదరు ఉద్యోగితో అసలు సమస్య ఏమిటో చర్చించి, ఆ సమస్యకు ఉద్యోగి వద్ద ఉన్న పరిష్కారం ఏంటో తెలుసుకుంటాడు. ఒకవేళ తన వద్ద అంతకన్నా మంచి పరిష్కారం ఉంటే వివరిస్తాడు. మొత్తంగా ఉద్యోగితో ఓ ఫ్రెండ్ లాగా, ఓ మెంటర్ లాగా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. ఉద్యోగి భావోద్వేగాలను పరిగణలోకి తీసుకొని బాస్ స్పందించడం ఇక్కడ ఎంతో కీలకం. ఇది కేవలం కెరీర్ లోనే కాదు జీవితంలో కూడా ఎంతో కీలకం)
ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎమోషనల్ ఇంటలిజెన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఉద్యోగులతో డీల్ చేసే విధానం మారితే ఆటోమెటిక్ గా వర్క్ అవుట్ పుట్ మారుతుంది. అంటే కంపెనీ స్వరూపం మారుతున్నట్లే. అందుకే కంపెనీలు ఎమోషనల్ ఇంటిలిజెన్స్‌ను ప్రాధాన్యత క్రమంలోకి చేర్చాయి. ఈ నేపథ్యంలో ఎమెషనల్ ఇంటిలిజన్స్పై ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోర్సులు చేసిన వారికి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ లో చాలా డిమాండ్ ఉంది. దేనినైనా తెలివిగా హ్యాండిల్ చేసి.. సమస్యను జటిలం కాకుండా చూసుకోవడమే ఎమోషనల్ ఇంటలిజెన్స్ అసలు ఉద్దేశ్యం.