జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిపారు. ఈ పిటిషన్లపై మంగళవారం వాదనలు ముగిశాయి.
- ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
- ఏపీ హైకోర్టులో ముగిసిన వాదనాలు
- తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి
ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి.. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, వి.వేణుగోపాలరావు, ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాల్సిన బాధ్యత ఎస్ఈసీపై ఉందని పిటిషనర్ల తరపు లాయర్ అన్నారు. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారన్నారు. అయితే వర్ల రామయ్య ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత ఆయనకు లేదని సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యాజ్యం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు లేవని వర్ల చెబుతున్నందున ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం అవుతుందని, దీనిపై ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉంటుందన్నారు. నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి మాత్రమే అన్నారు. ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల వరకు ఖర్చు అయిందని.. ఎన్నికలను రద్దు చేస్తే మళ్లీ ఖజానాపై భారం మోపడమే అవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికలు పూర్తి అయ్యాయన్నారు. ఫలితాల వెల్లడించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఏప్రిల్ 1న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 6న హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ఎన్నికల కోడ్ విధించలేదని పిటిషనర్లు వివరించారు. 7 రోజుల్లో ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది. ఆ తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఎస్ఈసీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది.
గత నెల 7న సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది.. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం చెప్పింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఫలితాలను మాత్రం వెల్లడించొద్దని సూచించింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చే తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది. ఈ నెల 8న పోలింగ్ జరగ్గా.. ఫలితాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టులో గత 15న విచారణ జరగ్గా.. ఎస్ఈసీ మూడు పిటిషన్లలో రెండింటింకి మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది.. మూడో పిటిషన్ కౌంటర్ దాఖలుకు సమయం కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను గత నెల 19కు వాయిదా వేసింది. మళ్లీ కోర్టులో ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది వాయిదా పడుతూ వస్తోంది.. మళ్లీ మంగళవారం విచారణ జరగ్గా.. తీర్పును రిజర్వ్ చేశారు.