- జూలై 1 నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు
- మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తప్పనిసరిగా వినతుల స్వీకరణ
- ఆ సమయంలో ఉద్యోగులందరూ సచివాలయాల్లోనే ఉండాలి
- క్షేత్రస్థాయి లేదా సమావేశాలకు వెళ్తే మూమెంట్ రిజిష్టర్‌లో రాయాలి
Biometric Salary Lik: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరును కార్యాలయానికి వచ్చినప్పుడు, కార్యాలయం నుంచి వెళ్లే సమయాల్లో వేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్, డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జూలై 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇక నుంచి హెఆర్‌ఎంఎస్‌లోనే సెలవులకు దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తప్పనిసరిగా కార్యాలయాల్లోనే ఉండి ప్రజల నుంచి వచ్చే వినతులను రోజూ తీసుకోవాలని పేర్కొన్నారు.
🌻క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలకు హాజరై ప్రజా వినతులను స్వీకరించాలని, అదే సమయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగులు బయోమెట్రిక్ ఒక సారికి, రెండో సారి వేయడానికి కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలని పేర్కొన్నారు. కార్యాలయాల పనివేళల్లో డిజిటల్ అసిస్టెంట్, వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సమావేశాలు, లేదా విధుల్లో భాగంగా ఎక్కడికైనా వెళితే మూమెంట్ రిజిష్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రేపటి నుంచే బయోమెట్రిక్ హాజరు అమలయ్యేలా కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలని సూచించారు.