Corona Deaths: యుపి లో జౌన్‌పూర్ లో నివసించే 27 సంవత్పరాల కళ్యాణి అనే టీచర్ 8 నెలల గర్భవతి. ఆమెకు పంచాయితీ ఎన్నికల నిర్వహణ డ్యూటీ వేసింది యుపి ప్రభుత్వం.
- మానవత్వం లేని యుపి ప్రభుత్వం
ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎన్నికల విధులనుండి మినహాయింపు ఇవ్వాలని పెట్టుకున్న అభ్యర్ధనను తోసిపుచ్చారు అధికారులు. పైగా ఎన్నికల విధులకు హాజరు కాని ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెడతామని ప్రకటించారు. ఉద్యోగం పోతుందన్న భయంతో కళ్యాణి ఏప్రిల్ 14 న ఎన్నికల విధుల శిక్షణకు, ఏప్రిల్ 15నుండి ఎన్నికల విధులకు హాజరైంది.ఏప్రిల్ 17 నుండి ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఆక్సిజన్ స్థాయిలు పడిపోసాగాయి. ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. ఆమె ఏప్రిల్ 24న మరణించారు.
సిద్ధార్థ్ నగర్ కు చెందిన లల్లన్ రామ్, ఆయన భార్య మీనాకుమారి ఇద్దరూ స్కూల్ ప్రిన్సిపాల్స్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 11న ఎన్నికల విధులకు ఇద్దరూ హాజరయ్యారు. ఏప్రిల్ 17 నుండి వారిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లల్లన్ రామ్‌కు పరీక్షలో కరోనా నెగెటివ్ వచ్చింది. కాని ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారుతూండడంతో ఆస్పత్రులలో అడ్మిషన్ కోసం ప్రయత్నించాడు. నెగెటివ్ రిపోర్టు ఉందని ఆస్పత్రులు అతడిని చేర్చుకోలేదు. అతి కష్టం మీద ఏప్రిల్ 24న ఆస్పత్రిలో బెడ్ దొరికింది. ఆ మర్నాడే అతను మరణించాడు. విద్యాశాఖ మాత్రం ఎన్నికల విధులకు గైరుహాజరయ్యాడంటూ అతనిపై కేసు పెట్టింది. ఇది ఆ ప్రభుత్వపు క్రూరత్వానికి పరాకాష్ట ! లల్లన్ రామ్ భార్య పరిస్థితి కూడా దిగజారి చివరకు ఆమె మే 4న మరణించారు. తనభర్త మరణించిన విషయం ఆమెకు తెలియనేలేదు !
ఇలా బలవంతంగా ఎన్నికల విధులకు పంపబడి కరోనా తో మరణించిన ఉపాధ్యాయులు యుపిలో 1621 మంది !
ఏప్రిల్ 28న అప్పటికి మరణించిన 708 మంది ఉపాధ్యాయుల జాబితాను జతచేస్తూ యుపి ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. మరణించిన టీచర్ల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో ఎన్నికల కౌంటింగ్ ను బారుకాట్ చేస్తామని హెచ్చరించింది. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. కాని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్ జరిపితీరాలని ఆదేశించింది. ఏ కౌంటింగ్ సెంటర్ వద్దా 75 మందికి మించి ఉండకూడదని నిబంధన పెట్టింది. కాని ఆ నిబంధనను అన్ని పార్టీలూ బేఖాతరు చేశాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. కౌంటింగ్ క్రమంలో మరికొంతమంది టీచర్లు కరోనా బారిన పడి మరణించారు
మొత్తం మరణించిన టీచర్లు 1621 మంది కాగా కేవలం ముగ్గురు మాత్రమే ఎన్నికల విధులలో కరోనా తో మరణించారని ప్రభుత్వం నిర్ధారించింది అలహాబాద్ హైకోర్టు మరణించిన ఒక్కో టీచరు కుటుంబానికీ కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించినా దానిని పట్టించుకోకుండా ఒక్కొక్కరికీ రు30 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల మరణాలకు కనీసం సంతాపాన్ని కూడా ప్రకటించలేదు కరోనా పరిస్థితిపై వాస్తవాలను వెల్లడించకుండా ఏదోవిధంగా స్థానిక ఎన్నికలను జరిపి తామే నెగ్గామని అనిపించుకోవాలని యోగి ప్రభుత్వం నానా పాట్లూ పడింది కాని ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది
పాలకపార్టీ అధికార జూదంలో 1621 మంది టీచర్లు మరణించారు వారి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి!