- జులైలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నాం -మంత్రి సురేశ్
Examinations: కరోనా కేసులు తగ్గుతుండడంతో జులైలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జులై మొదటి వారంలో ఇంటరు, చివరి వారంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని, విద్యార్థుల ప్రయోజనాల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కరోనా లేకపోతే పరీక్షలకు ఇబ్బందులు ఏమీ ఉండవని పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో డీఎస్సీ-2008 అభ్యర్థులతో కలిసి సీఎం జగన్‌ను ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.. ‘డీఎస్సీ-2008 అభ్యర్థుల సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. 2,193 మందికి సీఎం జగన్ న్యాయం చేశారు. వీరిని ఎస్జీటీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను నెరవేర్చారు. త్వరలో నియామక ఉత్తర్వులు ఇస్తాం.
ప్రభుత్వానికి చేరిన షెడ్యూల్
రాష్ట్రంలో ఈనెల 20 వరకు కర్య్ఫూ ఉన్నందున ఆ తర్వాత విద్యార్థులకు 15 రోజుల సమయం ఇచ్చి పరీక్షలను నిర్వహించేందుకు ఇంటరు విద్యామండలి షెడ్యూలు రూపొందించింది. అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది. జులై 7నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు 10లక్షలకుపైగా విద్యార్థులు హాజరు కానున్నారు. వీటి అనంతరం ఆగస్టులో ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల(ఈఏపీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలను జులై 26 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.