- 7 నుంచి ఇంటర్ పరీక్షలు కూడా?
- ‘పది’పై పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన
- నేడు సీఎం సమీక్షలో నిర్ణయించే చాన్స్
Examinations: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను జూలై 26 నుంచి ఆగస్టు 4 వరకు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇంటర్మీడియెట్ పరీక్షలను వచ్చే నెల 7 నుంచి 25 వరకు నిర్వహించేలా ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది. టెన్త్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ రూపొందించిన తాత్కాలిక షెడ్యూల్ ప్రభుత్వానికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం సీఎం జగన్ నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు 6.28 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 3 వేల మంది విద్యార్థులు తగ్గారు. పరీక్షల నిర్వహణకు 4,072 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో గతేడాది 11 పరీక్షా పేపర్లను 6 పేపర్లకు కుదించిన ప్రభుత్వం ఈ సారి 7 పేపర్లలో పరీక్షలు నిర్వహించనుంది. సైన్స్ సబ్జెక్టును.. ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పేపర్లుగా విభజించి ఒక్కో పేపర్‌ను 50 మార్కులకు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 4న ఫలితాలు విడుదల చేయాలని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కాగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి అందించినట్టు సమాచారం. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఒకే షెడ్యూల్‌లో నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు.