- దేనిపై దృష్టిపెట్టాలో తెలియక విద్యార్థుల అవస్థలు
- జేఈఈ, నీట్‌లకు తరగతులు ప్రారంభం
- ఆందోళనలో తల్లిదండ్రులు
Examinations: విజయవాడకు చెందిన స్వాతి పదో తరగతి పూర్తి చేసింది. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు పూర్తికాకుండానే ప్రైవేటు ఇంటర్ కళాశాలలు జేఈఈ, నీట్ కోచింగ్ ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభించాయి. ఇప్పుడు కోచింగ్ తరగతులకు హాజరు కావాలా? పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం కావాలా? అనే దానిపై తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఇది ఒక్క స్వాతి విషయమే కాదు. దాదాపు రాష్ట్రంలో మూడు లక్షలకుపైగా విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది 15 రోజుల ముందు సమాచారం ఇస్తామని ఇటీవల ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులు చదువుకోవడం కష్టమని విద్యార్థులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు పది పాఠాలు, పోటీ పరీక్షల తరగతులతో సతమతమవుతున్నారు. మరోవైపు సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసినందున ఆ విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు.
పాఠాలు.. పరీక్షలు..
ప్రైవేటు కళాశాలలు ఇంటర్ ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు చేరకపోతే సీటు లభిస్తుందో.. లేదోననే ఆందోళనతో తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పిస్తున్నారు. ప్రవేశాలు పొందిన వారికి మే నెల 25 నుంచి ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభించారు. రోజుకు నాలుగు తరగతులు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షల పాఠ్యాంశాలపై రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి సన్నద్ధం కావాల్సి వస్తోంది. నిర్లక్ష్యం చేస్తే జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌లో మంచి ర్యాంకు రాదనే భయం విద్యార్థులను వెంటాడుతోంది. మరోవైపు పది పాఠాలు నిర్లక్ష్యం చేస్తే మంచి గ్రేడ్ పాయింట్లు రావనే ఆందోళనా ఉంటోంది. పది పరీక్షలపై తమ కుమారుడు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్నాడని తిరుపతికి చెందిన ఓ విద్యార్థి తండ్రి వాపోయారు. దీన్నిబట్టే వారు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు.
కళాశాలల నుంచి సందేశాలు..
‘‘పదో తరగతి పరీక్షలు వాయిదా పడినందున ఇంటర్ పాఠాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పది రోజులకు ఐదు పాఠాలు చొప్పున బోధిస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి 50%-60% పాఠాలు పూర్తవుతాయి. విద్యార్థుల్ని తొందరగా చేర్పిస్తారని ఆశిస్తున్నాం’’ ఓ విద్యార్థి తండ్రికి కళాశాల పంపిన సంక్షిప్త సందేశం ఇది. అన్ని కళాశాలలు ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. కొన్నింటిలో ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. ప్రవేశం పొందిన వారికి ఆన్‌లైన్ లింకులు పంపించారు. రోజువారీ తరగతులకు రూ.2వేలు, వసతిగృహాల్లో ప్రవేశాలకు రూ.7-10వేలు ముందుగా రుసుములు తీసుకుంటున్నారు. ఒకవేళ ప్రవేశం రద్దు చేసుకుంటే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించరు.