Fake Oximeter Apps: కరోనా సక్షోభసమయంలో ఆక్సీమీటర్‌ల వినియోగం బాగా పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది ఆక్సిజన్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకునేందుకు ఆక్సీమీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సమయంలో స్మార్ట్ ఫోన్ యాప్‌ల ద్వారా ఆక్సిజన్ స్థాయిలు తెలుసుకోవచ్చని కొన్నియాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ప్రజల అవసరం మాటున్న కొన్ని యాప్స్ ఎంచక్కా వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న కొన్ని నకిలీ ఆక్సీమీటర్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసినప్పుడు.. జీపీఎస్, మెమరీ కార్డు, బ్లూటూత్‌లను వాడుకోవటానికి అనుమతి అడుగుతాయి. గ్యాలరీ, కాంటాక్టులు, సేవ్ అయిన డాక్యుమెంట్లను వాడుకునే అవకాశాలున్నాయి. దీంతో బ్యాంకు వివరానుల కూడా దొంగలించవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఫింగర్ ప్రింట్‌ను తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆక్సీమీటర్‌కు సంబంధించిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రముఖ కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్విక్ హీల్ తెలిపిన వివరాల ప్రకారం కొన్ని ఫేక్ ఆక్సీమీటర్ యాప్‌లు యూజర్ల బ్యాంక్ వివరాలను తస్కరిస్తున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియా, మెసేజ్‌ల ద్వారా వచ్చి యాప్‌లకు సంబంధించిన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు. ఇక యాప్ వివరణలో ఉండే ఇంగ్లిష్ ముఖ్యంగా గ్రామర్, స్పెల్లింగ్‌లను పరిశీలించాలని చెబుతున్నారు. సహజంగా ఫేక్ యాప్‌లలో భాషలో తప్పులు ఉంటాయనేది సైబర్ నిపుణుల అభిప్రాయం.