- ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం
- కొత్త విద్యావిధానంపై కార్యాచరణ సిద్ధం చేయండి
NEP: ఆంధ్రప్రదేశ్ లో 3, 4, 5 తరగతులను హైస్కూలు లో కలపాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు నిర్దేశించారు. కొత్త విద్యావిధానం అమలు చేసేందుకు తక్షణమే కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొత్త విద్యావిధానంపై సీఎం గురువారం సమీక్షించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. దీనికోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని జగన్ అధికారులకు సూచించారు.నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకునే మార్పులు చేస్తున్నామని చెప్పారు.
రెండు రకాల స్కూళ్లు
రెండు రకాల స్కూళ్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని జగన్ చెప్పారు. పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగా ఉంటాయి. వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుంది.
మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి10 వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న హైస్కూల్‌పరిధిలోకి తీసుకురావాలి. ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశమని ఆయన ప్రకటించారు. నలుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదని చెప్పారు. ఫౌండేషన్ కోర్సులో ఇది చాలా అవసరమన్నారు. 3 కిలోమీటర్ల లోపు హైస్కూల్ పరిధిలోకి 3,4,5 తరగతులను తీసుకువెళ్లే విధానాన్ని ఎవరూ వేలెత్తి చూపేలా ఉండకుండా చూసుకోవాలన్నారు. నూతన విద్యావిధానంలో ఒక స్కూల్ మూతపడ్డం లేదని చెప్పారు.