- గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు
- సాంకేతిక వసతులు లేక ఇబ్బందులు
Online Classes: కరోనా ప్రభావంతో విద్యార్థుల చదువు కొత్త పుంతలు తొక్కింది. పాఠశాల తరగతి గదిలో వినాల్సిన పాఠాలను నేడు చరవాణి, టీవీ ద్వారా వింటున్నారు. గతేడాది కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడటంతో విద్యావారధి కార్యక్రమాన్ని టీవీల ద్వారా ప్రసారం చేశారు. రోజూ 2 గంటలపాటు పాఠ్యాంశాలు వచ్చేవి. వాటిని ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. రెండో వేవ్ తీవ్రంగా ఉండటంతో ఇప్పట్లో బడులు తెరిచే అవకాశం లేకపోవటంతో ఆన్‌లైన్ ద్వారా పాఠ్యాంశాలు బోధించేలా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయుల నుంచి విద్యార్థుల వరకు ఏవిధమైన వసతులు అందుబాటులో ఉన్నాయో గూగుల్ ఫారం ద్వారా వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 2,465 పాఠశాలలు ఉండగా సుమారు 5.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్ ద్వారా 7, 8, 9, 10వ తరగతులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి.
తప్పనిసరి పరిస్థితుల్లోనే..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధన సాధ్యం కానందున.. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్ ద్వారా పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నారు. ఆన్‌లైన్ బోధన ఏ మాత్రం ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చూస్తే కొంత మేరకు ఆన్‌లైన్ చదువు సఫలమయ్యే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తరగతి బోధనలో ఒక్కో పీరియడ్ 40 లేక 45 నిమిషాలు ఉంటుంది. పిల్లల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉపాధ్యాయులు అప్పటికప్పుడు ఉదాహరణలతో, స్థానిక పరిస్థితులను బట్టి టీఎల్‌ఎం సహాయంతో బోధిస్తారు. అప్పటికీ కొంత మంది విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతిని పాఠ్యాంశాలు సరిగ్గా వినరని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రత్యక్ష బోధనలోనే అలా ఉంటే ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల అభిప్రాయాలు, ఇష్టాలతో పనిలేకుండా ఉపన్యాస పద్ధతిలో బోధన సాగించడం వల్ల ఏకాగ్రతతో వినే అవకాశం తక్కువని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.
నెలాఖరు వరకు షెడ్యూల్..
7, 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన షెడ్యూల్‌ను విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసింది. ఈనెల 30వ తేదీ వరకు ఆయా తరగతులు, పాఠ్యాంశాలు షెడ్యూల్‌ను రూపొందించారు. విద్యార్థులందరూ ఆన్‌లైన్ తరగతుల్లో పాల్గొనేలా చూడాలని ఉపాధ్యాయులకు తగిన సూచనలు చేశారు.
దూరవిద్యను ప్రోత్సహించాల్సిందే
కరోనా ప్రభావంతో పాఠశాలలు తెరిచే అవకాశం లేకపోవటంతో ప్రస్తుతం దూరవిద్య ద్వారానే విద్యను అందించాల్సి వస్తోంది. ఇంటి వద్ద వీక్షించే ప్రధాన ఛానళ్లలో విద్యాప్రసారాలు చేస్తే ఎక్కువ మంది ఆన్‌లైన్ ద్వారా వీక్షిస్తారు. ప్రసారమైన పాఠాలు యూట్యూబ్ ఛానల్‌లో పొందుపరిస్తే మరింత ఎక్కువ మంది చూసే అవకాశముంటుంది.
– జి.రాజకుమారి, చిగురుకోట పాఠశాల ప్రధానోపాధ్యాయిని
సులభమైన పద్ధతుల్లో
కరోనా మూడో దశ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందన్న హెచ్చరికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాలలో సామూహికంగా చదివే అవకాశం లేదు. గ్రామీణ విద్యార్థుల్లో అత్యధికులు నెట్‌వర్క్, విద్యుత్తు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే దూరదర్శన్‌లో ప్రసారమైన పాఠాలను యూట్యూబ్‌లో పొందుపరచాలి. ఒకేరకమైన బోధన, అభ్యసన ప్రణాళిక ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. రికార్డింగ్ వీడియోలతో బోధన చేపట్టి వాట్సాప్ గ్రూపుల ద్వారా తల్లిదండ్రులకు పంపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
-కూనపరెడ్డి సత్యనారాయణ, విద్యానిపుణులు