Taj Mahal open : భారతదేశ చారిత్రక కట్టడం, పాలరాతి అపురూపం తాజ్ మహల్ సందర్శనకు ఇవాళ్టి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక మీదట యథావిథిగా అందరికీ తాజ్ మహాల్ అందాలను తిలకించే అవకాశం కల్పించనున్నారు. అయితే తాజ్ మహల్ చూడాలనుకునేవారు ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫోన్ ద్వారా గరిష్ఠంగా 5 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. తాజ్ మహల్ సందర్శనకు విడతకు 650 మందిని అనుమతించనున్నారు. అటు, ఆగ్రాకు సమీపంలోని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 228 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శనను ఇన్నాళ్లూ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో.. పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో తాజ్‌మహల్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్మారక కేంద్రాలను తెరుస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. జూలై 6 నుంచి అన్ని స్మారక కేంద్రాల్లోకి పర్యాటకులను అనుమతిస్తామని వెల్లడించారు. అయితే, పర్యాటకులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. పర్యాటకుల సందర్శనకు సంబంధించి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రహ్లాద్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఇలా ఉండగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో భాగంగా భారీగా కేసులు పెరగడంతో అప్రమత్తమైన కేంద్రం.. స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను ఏప్రిల్ 15నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి (జూన్ 16) కేంద్ర సంరక్షణలో ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను తిరిగి తెరవాలని నిర్ణయించారు.