- ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి
కృష్ణా జిల్లాలో ఐదు దశాబ్దాలకు పైగా విద్యా రంగంలో తిరుగులేని ముద్ర వేసిన ఎయిడెడ్ పాఠశాలలు అనేకం ఉన్నాయి. విజయవాడ నగరంలోనే 95 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు. ఒక్కో పాఠశాలలో 300 నుంచి వెయ్యి మంది వరకు విద్యార్థులున్నవి ఉన్నాయి. ప్రస్తుతం ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసుకుంటుండడంతో ఈ పాఠశాలలన్నీ ఇక ప్రైవేటుగా మారనున్నాయి. ఎయిడెడ్ పాఠశాలలను పూర్తిగా ఆస్తులతో సహా ప్రభుత్వానికి ఇస్తే వాటిని ప్రభుత్వ బడులుగా మార్చి కొనసాగిస్తారు. కానీ జిల్లా మొత్తంగా రెండు మూడు పాఠశాలలు మినహా మొత్తంగా ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎవరూ అంగీకరించలేదు. దీంతో ఈ పాఠశాలలన్నీ ప్రైవేటుగా మారిపోతే అక్కడ చదివే పిల్లలు ఫీజులు చెల్లించాలి.. లేదంటే సమీపంలో ఉన్న మరో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చేరాలి. ప్రస్తుతం ఇదే తల్లిదండ్రులు, వారి పిల్లలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
విజయవాడలో మూసివేసిన మాంటిస్సోరి పాఠశాల
కృష్ణా జిల్లాలో 450కు పైగా ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఇప్పటికే 270 పాఠశాలలు ఉపాధ్యాయులను ఇచ్చేయడానికి అంగీకర పత్రాలు సమర్పించాయి. మిగతా పాఠశాలలు ఏవీ అంగీకార పత్రాలను ఇవ్వలేదు. ప్రస్తుతం వీటిలో కొన్ని పాఠశాలలు తమ అంగీకారపత్రాలను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపాయి.
తాము ఉపాధ్యాయులను కూడా వెనక్కి ఇచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నాయి. ప్రధానంగా ఆర్‌సీఎం స్కూళ్లకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. విజయవాడలోని బిషప్‌గ్రాసి, సెయింట్ ఆంథోని, సెయింట్‌జోసెఫ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పెజ్జోనిపేట, టైలర్ పేటల్లో ఉన్న ఆర్‌సీఎం పాఠశాలలు వీటిలో ఉన్నాయి. ఇప్పటికే చాలా పాఠశాలల్లో తల్లిదండ్రులు యాజమాన్యాలకు లేఖలు సైతం ఇస్తున్నాయి. విజయవాడ సింగ్‌నగర్‌లోని శ్రీవివేకానంద సెంటినరీ తెలుగుమీడియం పాఠశాల 1964లో ఏర్పడింది. రామకృష్ణా సమితి ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఎయిడెడ్‌గానే నడుస్తోంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 15 మంది ఉపాధ్యాయులు ఉండగా 470 విద్యార్థులు చదువుకుంటున్నారు. విజయవాడలోని మాంటిస్సోరి, బిషప్ హజరయ్య, ఎస్.కె.పి.వి.హిందూ హైస్కూల్ ఇవన్నీ దశాబ్దాలుగా నడుస్తున్న ఎయిడెడ్ పాఠశాలలే. వీటన్నింటినీ ప్రైవేటుగా మార్చేస్తే ఇక పేద విద్యార్థులకు సర్కారు బడులు తప్ప మరో దిక్కు లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
బాధగా ఉంది..
మాంటిస్సోరి పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివాను. పదో తరగతిలోకి వెళ్లిన కొద్ది రోజుల తర్వాత పాఠశాల యాజమాన్యం మూసివేస్తున్నామని చెప్పారు. పదో తరగతి సీవీఆర్‌జీఎమ్‌సీహెచ్ పాఠశాలలో చేరాను. నాలుగేళ్ల పాటు చదువుకున్న పాఠశాలను వదిలి రావడం ఎంతో బాధగా ఉంది. దూరాభారమైనా తప్పక రావాల్సి వస్తోంది.
– సమీరా, పదోతరగతి, రామలింగేశ్వరనగర్
ఎయిడెడ్ పాఠశాలలు ఉండాలి..
కొన్నేళ్ల నుంచి ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడం వల్ల నమ్మకం కలిగి తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇలా కొనసాగుతున్న వ్యవస్థను ఒక్కసారిగా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు.
– శరత్‌చంద్రకుమార్, విద్యార్థిని తండ్రి, కృష్ణలంక
పాఠశాలను కొనసాగించాలి..
శ్రీవివేకానంద సెంటినరీ పాఠశాల ఇక్కడున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మంచి ఉపాధ్యాయులున్నారు. మా పిల్లలకు మంచి చదువు దొరుకుతోంది. అంతా ఉచితంగానే ఇప్పటివరకు చదువుకున్నారు. ఇప్పుడు ప్రైవేటుగా మారిస్తే మా పిల్లల పరిస్థితి ఏంటి. పాఠశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలి. లేదంటే మా పిల్లల భవిష్యత్తుకు తీరని నష్టం కలుగుతుంది.
– బి.కామేశ్వరి, విద్యార్థిని గార్డియన్, అజిత్‌సింగ్‌నగర్
పిల్లల చదువులకు ఇబ్బంది..
వివేకానంద పాఠశాల మా పిల్లల భవిష్యత్తుకు ఆధారం లాంటిది. చాలా మంది ఇక్కడే చదువుకుని ప్రస్తుతం పైకి ఎదిగారు. పాఠశాలలో చదువు బాగానే చెబుతున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. అన్ని ప్రభుత్వ పథకాలు మా పిల్లలకు అందుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మూయడానికి మేం అంగీకరించం. ఈ గందరగోళ పరిస్థితులు విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతాయి.
– కె.సుజాత, విద్యార్థిని తల్లి, అజిత్‌సింగ్‌నగర్