వాంఖడే టెస్టుని నాలుగు రోజుల్లోనే టీమిండియా ముగించేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌లో తేలిపోయిన న్యూజిలాండ్‌ని ఏకంగా 372 పరుగుల తేడాతో భారత్ ఓడించేసింది.
- వాంఖడే టెస్టులో భారత్ అలవోక విజయం
- 540 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ 167 ఆలౌట్
- మ్యాచ్‌లో 14 వికెట్లు పడగొట్టిన కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్
- శతకం నమోదు చేసిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్
న్యూజిలాండ్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 540 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా మ్యాచ్‌లో నాలుగో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 140/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ టీమ్ 167 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత బౌలర్లలో అశ్విన్, జయంత్ యాదవ్ నాలుగేసి వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్‌కి ఒక వికెట్ దక్కింది. టామ్ బ్లండెల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో.. రెండు టెస్టుల సిరీస్‌ని కూడా భారత్ 1-0తో దక్కించుకోగా.. కాన్పూర్ వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150: 311 బంతుల్లో 17×4, 4×6) శతకం నమోదు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టేశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ ఎవరూ ఊహించనిరీతిలో 62 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఏకంగా 9 మంది బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమవగా.. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు, సిరాజ్ మూడు, అక్షర్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. దాంతో.. భారత్ జట్టుకీ 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 276/7తో డిక్లేర్ చేయగా.. న్యూజిలాండ్ ముందు 540 పరుగుల టార్గెట్ నిలిచింది.