RBI: కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే కొత్త వేరియంట్ వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ అందరిలో..
RBI: కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే కొత్త వేరియంట్ వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ అందరిలో వణుకు పుట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు అలముకొన్న నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా ఉంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం కానుంది. కీలక వడ్డీ రేట్లపై బుధవారం ఆర్‌బీఐ ప్రకటన చేయనుంది.
వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం..
కరోనా కొత్త వేరియంట్ పట్ట ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయి స్పష్టత వచ్చాకే వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ అభిప్రాయపడింది. రివర్స్ రెపో రేట్లను నామమాత్రంగా సవరించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచితే అది వరుసగా తొమ్మిదో సారి అవుతుంది. చివరి సారిగా 2020 మే 22న వడ్డీ రేట్లను సవరించింది. భవిష్యత్‌లో అయితే రెపో రేట్లు పెరుగుతాయని, గృహ రుణ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని అన్‌రాక్ గ్రూప్ ఛైర్మన్ తెలిపారు.
రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెపో రేటును నిర్ణయిస్తారు. రెపో రేటునను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తాయి. ఈ ప్రభావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రెపో రేటు తగ్గించినా దానిని సామాన్యులకు బదలాయించేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు.
రివర్స్ రెపో రేటు అంటే ఏమిటీ?
బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వొచ్చు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఇది రెపో రేటు కన్నా తక్కువగా ఉంటుంది. మార్కెట్లో స్థిరత్వం లేనప్పుడు బ్యాంకులు తమ అదనపు డబ్బును ఆర్‌బీఐ వద్ద ఉంచి తక్కువైనా సరే స్థిర వడ్డీ ఆదాయాన్ని పొందేందుకు ఆసక్తి చూపిస్తాయి.