ఈ రోజుల్లో దాదాపు అన్ని ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం లేచిన సమయం నుంచి మనమందరం వాడే పాలు (Milk) కల్తీ అవుతున్నాయి. అడ్డదారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి కొందరు పాలలో యథేచ్ఛగా కెమికల్స్ కలుపుతున్నారు.
Adulterated Milk: పాల కల్తీని గుర్తించే సరికొత్త పద్ధతి.. అందుబాటులోకి కొత్తరకం డిప్‌స్టిక్.. వివరాలివే..!
ఈ రోజుల్లో దాదాపు అన్ని ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం లేచిన సమయం నుంచి మనమందరం వాడే పాలు (Milk) కల్తీ అవుతున్నాయి. అడ్డదారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి కొందరు పాలలో యథేచ్ఛగా కెమికల్స్ కలుపుతున్నారు. ఇవి పాలలో నీళ్లలా కలిసిపోవడంతో వీటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. దీంతో పాలు కల్తీ (Adulterated Milk) అయ్యాయో లేదో తెలుసుకోలేక సామాన్య ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో పాలలో కల్తీ పదార్థాలను పసిగట్టే ఓ డిప్‌స్టిక్‌ను గుజరాత్‌లోని అమ్రేలీ కాలేజ్ ఆఫ్ డెయిరీ సైన్స్ (Amreli’s College Of Dairy Science) అభివృద్ధి చేసింది. ఈ డిప్‌స్టిక్‌ను ఉపయోగించి కేవలం రూ.1 ఖర్చుతో మిల్క్ క్వాలిటీని ఇంటి వద్దే అత్యంత సులభంగా టెస్ట్ చేసుకోవచ్చు. పాలలోని కల్తీ పదార్థాల (Adulterants)ను గుర్తించే ఈ డిప్‌స్టిక్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
వివరాల్లోకి వెళితే.. పాలలో కల్తీ పదార్థాలను గుర్తించేందుకు నానోటెక్నాలజీ బేస్డ్ డిప్‌స్టిక్ (Dipstick)ను కామధేను (Kamdhenu) యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అమ్రేలీ సిటీలోని కాలేజ్ ఆఫ్ డెయిరీ సైన్స్ అభివృద్ధి చేసింది. ఈ డిప్‌స్టిక్ పాలలో ఎనిమిది రకాల కల్తీ పదార్థాలను క్షణాల్లోనే గుర్తించగలదు. దీని గొప్పతనం ఏంటంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి ‘కృతగ్య హ్యాకథాన్ 2.0 (Kritagya Hackathon)’ పోటీలో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 1,974 మంది తమ కొత్త ఆవిష్కరణతో పాల్గొన్నారు. దాని ఫలితాలు ఏప్రిల్ 13న ప్రకటించడం జరిగింది.
అమ్రేలీ కాలేజ్ ఆఫ్ డెయిరీ సైన్స్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పేటెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసింది. ఇది పేటెంట్ పొందిన తర్వాత, కాలేజీ ఈ టెక్నాలజీని కమర్షియల్ ప్రొడక్షన్ కోసం బదిలీ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ గ్రామస్తులు, నగరవాసులు తమ ఇళ్ల వద్ద పాల కల్తీని త్వరితగతిన సులువుగా గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. పాలలో కల్తీ పదార్థాలు, మలినాలను లాబరేటరీలో పరిశీలించవచ్చు. కానీ ఈ ప్రక్రియ సమయంతో కూడుకున్నది, అలానే ఖరీదైనది. దీనికి నిపుణుల మార్గదర్శకత్వం కూడా అవసరం. అయితే లేటెస్ట్ గా డెవలప్ చేసిన డిప్‌స్టిక్‌తో చాలా వేగంగా పాలలో కెమికల్స్ పసిగట్టవచ్చు. అలాగే దీనికి అయ్యే ఖర్చు ఒక్క రూపాయి మాత్రమే.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం… పాలలో స్టార్చ్, యూరియా, డిటర్జెంట్, మాల్టోడెక్స్ట్రిన్ (Maltodextrin), న్యూట్రలైజర్, బోరిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియం సల్ఫేట్ వంటి అనేక ఇతర మలినాలతో సహా 20 కంటే ఎక్కువ రకాల కల్తీ పదార్థాలు ఉంటాయి. పాలను కల్తీ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. స్కిమ్డ్ పౌడర్ నుంచి సింథటిక్ మిల్క్ తయారు చేయడం ఒక మార్గమైతే.. సహజ పాలలో యూరియా, బోరిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, స్టార్చ్, న్యూట్రలైజర్ కలపడం ద్వారా కల్తీ పాలు తయారు చేయడం మరో మార్గం.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం… మొదటి కల్తీ పద్ధతిలో, సింథటిక్ పాలను యూరియా, ఉప్పు, ఎడిబుల్ ఆయిల్, చక్కెర, కాస్టిక్ సోడా, డిటర్జెంట్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌తో కరిగించడం లేదా కలపడం ద్వారా పొందవచ్చు. మిల్క్ క్వాంటిటీ పెంచడానికి… మరింత ఆదాయాన్ని సంపాదించడానికి ఈ మిశ్రమాన్ని మళ్లీ సహజమైన పాలతో కలుపుతారు. ఈ సింథటిక్ పాలు ఆరోగ్యానికి చాలా హానికరమని పరిశోధకులు పేర్కొన్నారు. స్వచ్ఛమైన సహజ పాలను యూరియా, బోరిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, స్టార్చ్, న్యూట్రలైజర్‌తో కలపడం ద్వారా పాలను కల్తీ చేయడం మరో పద్ధతి.
ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన వర్సిటీ డీన్, డెయిరీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ వీఎం రమణి దీని గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సులువుగా వాడటం, వెంటనే రిజల్ట్స్ పొందడం, తక్కువ ధర అనేది ఈ టెక్నాలజీ స్పెషాలిటీ అని రమణి అన్నారు. ఈ టెస్ట్ చేయడానికి ఎటువంటి నైపుణ్యం అవసరం లేదని.. ఇంటి స్థాయి నుండి జిల్లా పాల సహకార స్థాయి వరకు అందరూ దీన్ని వాడొచ్చన్నారు. ఈ టెక్నాలజీ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కల్తీలను ఒకేసారి గుర్తిస్తుందని.. అందుబాటులో ఉన్న ఏ ఇతర సాంకేతికతలో ఇలాంటి ఫెసిలిటీ లేదన్నారు.