గత ఐదేళ్లుగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరు తనను బాధించిందిన ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు బాధ్యతల స్వీకరణ అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ.. గత పాలనలో వ్యవహరించిన తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
గడచిన 5 ఏళ్లలో కొందరు IASల తీరు చాలా బాధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సచివాలయంలో IAS, IPS అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన ఐదేళ్ళలో కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల వైఖరి తనను బాధించిందన్నారు. IAS,IPS లు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. 1995 నుంచి పలు దఫాలుగా సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు.
గడచిన ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ఆత్మ విమర్శ చేసుకోవాలని బాబు సూచించారు. మరోసారి శాఖల వారీగా IAS, IPSలతో సమావేశం అవుతానన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సారిగా సచివాలయానికి వచ్చిన సీఎంకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రవీణ్ ప్రకాష్, శ్రీ లక్ష్మీ, PSR ఆంజనేయులు అందించిన పుష్పగుచ్ఛాలను సీఎం తిరస్కరించినట్లు సమాచారం.
జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ముగ్గురు అధికారులు కీలకంగా వ్యవహరించారు. శ్రీలక్ష్మి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. పీఎస్సార్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. సునీల్ కుమార్ జగన్ సర్కార్ లో సీఐడీ చీఫ్ గా ఉన్నారు.