JC Prabhakar Reddy Vs Peddareddy : అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం పోలీసులు టెన్షన్ పడ్డారు. ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందారు.. కొద్దిసేపటి తరువాత హమ్మయ్య అంటూ అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది..? పోలీసులు ఎందుకు టెన్షన్ పడ్డారనే విషయాల్లోకి వెళితే.. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో విబేధాలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉన్నాడు. ఉన్నట్లుండి శనివారం ఉదయం తాడిపత్రి పట్టణంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు టెన్షన్ పడ్డారు.
ఎన్నికల పోలింగ్ మరుసటిరోజు జరిగిన ఘర్షణలో కండిషన్ బెయిల్ కు సంబంధించి సంతకాలు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కు కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చాడు. నిన్నటి రోజు (శుక్రవారం) జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రికివస్తే పంచ ఊడదీసి కొడతా అని జేసీ హెచ్చరించాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకు స్పందించి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చాడని పోలీసులు ఆందోళన చెందారు. వెంటనే తాడిపత్రి పట్టణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందారు. కానీ, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కండీషన్ బెయిల్ కు స్టేషన్లో సంతకం పెట్టి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు, స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
స్టేషన్ లో సంతకం అనంతరం పెద్దారెడ్డి వెంటనే తాడిపత్రి నుంచి అనంతపురం బయలుదేరి వెళ్లిపోయాడు. పెద్దారెడ్డి వాహనాలను పోలీసులు కొద్దిదూరం ఫాలో అయ్యారు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చిన విషయం తెలుసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఏమైనా ఘర్షణకు పాల్పడతారాని పోలీసులు ఆందోళన చెందారు. కానీ, జేసీ వర్గీయుల నుంచికూడా ఎలాంటి అలికిడి లేకపోవటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.