ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేని వర్షం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పడుతోంది. అటు క్రిష్ణా క్యాచ్ మెంట్ ఏరియాలోనూ భారీ వర్షపాతం నమోదవుతుండటంతో రిజర్వాయర్లలోకి నీరు వచ్చిచేరుతుంది. పంట కాల్వలకు నీటిని అధికారులు విడుదల చేశారు.
నిన్న మొన్నటి వరకూ బోసిపోయిన రిజర్వాయర్లు జలకళతో కనువిందు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న ఎత్తిపోతలకు నీటి ప్రవాహం మొదలైంది. దీంతో ఎత్తిపోతలకు పర్యాటకుల క్యూ కడుతున్నారు. గత ఏడాది కంటే ముందే ఈసారి ఎత్తిపోతలకు వరదనీరు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎత్తిపోతల వద్ద ప్రకృతి సౌందర్యం పర్యాటకులను కట్టి పడేస్తుంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ వద్దకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా ఎత్తిపోతలను సందర్శిస్తుంటారు. అటు తెలంగాణ ఇటు ఏపి నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు నాగార్జున సాగర్‌కు వస్తుంటారు.
మిగిలిన సమయల్లో కంటే తొలకరి జల్లులు పడే సమయంలో ఎత్తిపోతలకు జలకళతో ఉట్టిపడుతుంటుంది. అందుకే ఈ సమయంలో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఎత్తిపోతలకు వచ్చే ప్రకృతి ప్రేమికులు అక్కడే ఉన్న దత్తాత్రేయ, రంగనాథస్వామి ఆలయాలను సందర్శిస్తుంటారు.
తొలిఏకాదశి ఉత్సవాలను రెండు రోజుల క్రితం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తొలి ఏకాదశి పండుగ రోజున హాజరయ్యారు. ఇటు ప్రకృతి సౌందర్యం అటు భక్తిభావంతో ఎత్తిపోతలకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.