Gossip Garage : ఆయన తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్.. నేను గాంధీ ఫ్యామిలీ తాలూకా అని చెప్పుకునే ఏకైక నాయకుడు… మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఓ సారి పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓసారి మంత్రిగా పనిచేసిన అనుభవం…. ఇంతటి అనుభవశాలిని ప్రస్తుత కాంగ్రెస్ నేతలు అస్సలు పట్టించుకోవడం లేదట… నికార్సైన కాంగ్రెస్ వాదిగా నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నా… సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మదనపడుతున్నారు సదరు లీడర్. 76 ఏళ్ల వయసులో యాక్టివ్ పాలిటిక్స్‌లో తిరుగుతున్న ఆ నేత ఆవేదన ఏంటి? కాంగ్రెస్ పెద్దలపై అసంతృప్తికి కారణమేంటి?
తనకో పదవి ఇవ్వాలని బతిమిలాడుతున్నారు…
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్.. అందరికి సుపరిచితమైన నేత వి.హనుమంతరావు. పార్టీలో అంతా దాదా అని పిలుచుకునే వీహెచ్ గత కొంత కాలంగా పార్టీ ముఖ్య నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీ ఏ పని అప్పగించినా, క్రమశిక్షణతో పూర్తిచేసే తనలాంటి వారిని అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీహెచ్. దాదాపు 8 ఏళ్లుగా పార్టీలో ఎలాంటి పదవివ్వకపోయినా .. కాంగ్రెస్ బలోపేతం కష్టపడ్డానని.. 76 ఏళ్ల వయసులో శక్తినంతా కూడదీసుకుని పార్టీ కోసం పనిచేస్తున్నానని చెబుతున్న వీహెచ్.. చివరి అవకాశంగా తనకో పదవి ఇవ్వాలని తెలిసిన నేతలందరినీ బతిమిలాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నేతలను ఏకతాటి పైకి తెచ్చేందుకు తాను చేసిన కృషిని గుర్తుచేస్తున్న వీహెచ్…. సీనియర్ నేతలందరికీ ఫోన్లు చేస్తూ ఒక్క చాన్స్ ఇవ్వండ్రా బై అంటూ వేడుకుంటుండటం ఆసక్తికరంగా మారింది.
నమ్మకమైన వ్యక్తి, పార్టీలో పెద్దన పాత్ర..
ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లలో వీహెచే సీనియర్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్నారు. 1989లో అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఎన్నికైన వీహెచ్… తొలిసారే రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1992లో రాజ్యసభకు వెళ్లిన వీహెచ్… 2004లో రెండోసారి 2010లో మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన వీహెచ్… తన పదవీకాలం పూర్తయ్యాక మాజీ అయ్యారు. ఇక అక్కడి నుంచి పార్టీ పదవి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన వయసు రీత్యా అవకాశాలు దక్కలేదు. కానీ, పార్టీకి నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలు వచ్చిన ప్రతిసారి పెద్దన్న పాత్రలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేవారు వీహెచ్. ఈ క్రమంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందా? అని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
చివరి అవకాశంగా చాన్స్ ఇవ్వాలని విన్నపం..
కాంగ్రెస్ గెలిచినా, వీహెచ్ ఆశలు ఫలించడం లేదు. గాంధీ ఫ్యామిలీకి నమ్మిన బంటునంటూ ఆయన ఇన్నాళ్లు నెరిపిన రాజకీయం అక్కరకు రావడం లేదు. మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం వస్తుందని ఆశిస్తే… రాహుల్‌గాంధీ చొరవతో సీనియర్ నేత రేణుకా చౌదరి, యువత కోటాలో అనిల్‌కుమార్ యాదవ్ ఆ అవకాశాన్ని కైవసం చేసుకున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలోనూ ఏ పదవీ దక్కకపోవడంతో వీహెచ్‌లో అసంతృప్తి పెరిగిపోతోందంటున్నారు. ఐతే తాజాగా సీనియర్ నేత కే.కేశవరావు రాజీనామాతో రాష్ట్రం నుంచి ఓ రాజ్యసభ స్థానం ఖాళీ ఏర్పడింది. ఇంకా రెండేళ్లు పదవీకాలం ఉన్న ఈ స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతున్నారు వీహెచ్. చివరి అవకాశంగా చాన్స్ ఇస్తే… హ్యాపీ రిటైర్మెంట్ తీసుకుంటానని నేతలకు ఫోన్లు చేస్తున్నారట వీహెచ్.
ఢిల్లీ హైకమాండ్ లో పలుకుబడి ఉన్న నేతలకు ఫోన్ల మీద ఫోన్లు..
సీనియర్‌గా తనను గుర్తించాల్సిందిగా… అందరికీ ఫోన్లు చేస్తున్న వీహెచ్… కుదిరితే రాజ్యసభ లేదంటే… పార్టీలో అత్యున్నత గౌరవం ఉండే సీడబ్ల్యూసీ… అప్పటికీ కుదురకపోతో ఓబీసీ సెల్ చైర్మన్ పదవి అయినా ఇప్పించాలని ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు… అటు ఢిల్లీ హైకమాండ్‌లో పలుకుబడి ఉన్న నేతలకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారట వీహెచ్. మీకు ఏది కుదిరితే అది చేయండి.. నన్ను మాత్రం ఖాళీగా వదిలేయకండంటూ వీహెచ్ చేస్తున్న విజ్ఞప్తులపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.