Inspiring story: “మురికివాడల్లో నివసించే వారు క్రేజీ మైండ్స్‌తో ఉంటారని జనం అనుకుంటూ ఉంటారు. వారు అనుకున్నది నిజమే. ఎందుకంటే నా మైండ్స్ క్రేజీగా లేకపోయుంటే నేను ఈరోజు ఇక్కడికి దాకా వచ్చేదాన్ని కాద”ని ఢిల్లీకి చెందిన అమితా ప్రజాపతి అనే యువతి తన లింక్డిన్ పేజీలో రాసుకున్నారు. తన తండ్రిని ఉద్దేశించి ఆమె ఒక పోస్ట్ చేశారు. పదేళ్ల కష్టం ఫలించిందని, తన కల సాకారమైందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన తండ్రిని సంతోషంగా ఆత్మీయ ఆలింగనం చేసిన వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏమిటి?
అమితా ప్రజాపతి తన పోస్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె తండ్రి ఒక చాయ్ వాలా. టీలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూతురిని మాత్రం బాగా చదివించారు. చాలీచాలని సంపాదనతో ఆర్థిక ఇబ్బందులు, బంధువుల నుంచి వెక్కిరింపులను లెక్కచేయకుండా కూతురు చదువును ప్రోత్సహించారు. ఆయన కష్టం ఊరికే పోలేదు. కాలం పెట్టిన పరీక్షలకు నిలబడి ఆయన కుమార్తె చార్టర్డ్ అకౌంటెంట్‌గా తిరిగొచ్చింది. “నాన్నా నేను చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాను” అంటూ కూతురు ఆనందంతో హత్తుకోవడంతో ఆ తండ్రి కళ్లు ఒక్కసారిగా ఆనందభాష్పాలు వర్షించాయి. ఈ ఆనంద క్షణాలను వీడియో తీసి లింక్డిన్ పేజీలో పోస్ట్ చేశారు అమితా ప్రజాపతి. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కు లక్షా 60 వేలకు పైగా లైకులు, 9 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.
ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు..
“నాన్నా నేను చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాను. దీనికి పదేళ్లు పట్టింది. ప్రతిరోజు నా కలను నా కళ్లలోనే నిలుపుకున్నాను. నా స్వప్నం ఎన్నటికైనా నిజమవుతుందా అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. 2024, జూలై 11న నా కల నెరవేరింది. అవును, కలలు నిజమవుతాయి. బిలో యావరేజ్ స్టూడెంట్ అయిన మీ కూతుర్ని సీఏ లాంటి కష్టమైన కోర్సులో ఎందుకు చేర్చారని చాలా మంది మిమ్మల్ని అడుగుతుండేవారు. నేను సీఏ కంప్లీట్ చేయలేనని నిరుత్సాహపరిచారు. చాయ్ అమ్మి సీఏ చదువు చెప్పించలేరని, దానికి బదులుగా డబ్బు కూడబెట్టి ఇల్లు కట్టుకోమని సలహాయిచ్చారు. ఎదిగిన కూతుళ్లతో ఎంతకాలం మీరు వీధుల్లో ఉంటారు? ఎలాగూ ఏదో ఒకరోజు వాళ్లు అత్తారింటికి వెళ్లిపోయే వాళ్లే.. అప్పుడు మీకేమీ మిగలదు అంటూ హితవచనాలు చెప్పేవారు. అవును నిజమే.. నేను మురికివాడలో నివసిస్తున్నాను (ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు), కానీ ఇప్పుడు నేను సిగ్గుపడను.
మురికివాడల్లో నివసించే వారు క్రేజీ మైండ్స్‌తో ఉంటారని కొంతమంది అంటుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే నాకున్న పిచ్చితోనే నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు మా నాన్నకి ఇల్లు కట్టించేంత సామర్థ్యం నాకుంది. నేను ఆయన కలలను సాకారం చేయగలను. మొదటి సారి నేను మా నాన్నను కౌగిలించుకుని ఏడ్చాను. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. నేను ఈ క్షణం కోసం ఎంతో కాలం వెయిట్ చేశాను. ఈ స్వప్నాన్ని తెరిచిన కళ్ళతో ఊహించాను. ఈ రోజు ఇది నిజమైంది. నా కల నెరవేరడానికి ఎక్కువ కాలం పట్టిందని నేను అనుకోవడం లేదు. నమ్మండి కలలు కచ్చితంగా నిజమవుతాయి. ఈ రోజు చార్టర్డ్ అకౌంటెంట్‌గా మీ ముందు నిలబడ్డానంటే దానికి మా అమ్మానాన్నే నమ్మకమే కారణం. ఏదోక రోజు తమను విడిచిపెట్టి మెట్టినింటికి వెళ్లిపోయే కూతురికి చదువు ఎందుకని వారు అనుకోలేదు. తమ కూతురు బాగా చదవాలన్న ఆలోచనతో కష్టాలన్నీ భరించార”ని అమితా ప్రజాపతి తన పోస్ట్‌లో రాశారు. దీన్ని చదివిన వారందరూ అమితా ప్రజాపతితో పాటు ఆమె తండ్రిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.