ఏపీ బీజేపీలో ఆ ఇద్దరు నేతల ఫ్యూచర్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది… బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడిన ఆ ఇద్దరు నేతలు… గత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇద్దరూ టికెట్లు ఆశించినా… పొత్తుల్లో చాన్స్ దక్కించుకోలేకపోయారు. మరి ఇప్పుడు నామినేటెడ్ కోటాలోనైనా వారికి బెర్త్ కన్ఫార్మ్ అవుతుందా? వెయిటింగ్ లిస్టులో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఎవరు?
కూటమిలో మిత్రపక్షంగా తిరుగులేని విజయం సాధించిన ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ మొదలైంది. ఇప్పటికే టీడీపీ, జనసేన తమ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తీసుకోగా, భవిష్యత్‌లో ఏర్పడే ఖాళీలను తమకు కేటాయించాలని కోరుతోంది బీజేపీ… ఇక చాన్స్ వస్తే ఫస్ట్ తమ పేరే ఉండాలని బీజేపీ సీనియర్ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరూ గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, పొత్తుల్లో వారికి సీట్లు దక్కలేదు. దీంతో నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వారి నేపథ్యం?
బీజేపీలో ఏ పదవులు భర్తీ చేయాలన్నా… ముందుగా పార్టీలో వారి నేపథ్యం గమనిస్తారు. బీజేపీ ఫస్ట్ అన్నట్లు…. తొలి నుంచి పార్టీలో ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇలాంటి కోటాలోనే కేంద్ర సహాయమంత్రిగా భూపతిరాజు శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ పదవులు దక్కించుకున్నారు. దీంతో ఎమ్మెల్సీలుగా తమకే ముందు అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకుంటున్నారు విష్ణు, వీర్రాజు.
ఇద్దరికీ సంఘ్ నేపథ్యం ఉండటంతో అధిష్టానం తప్పకుండా తొలి అవకాశమిస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరికి పార్టీలోనూ ఎలాంటి పదవులు లేవంటున్నారు. వీర్రాజు గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా… ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఇద్దరికీ జాతీయస్థాయిలో పరిచయాలు ఉండటంతో తమకు పదవులు పక్కా అని అనుచరులతో చెబుతున్నారట…
ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాంతీయ, సామాజిక సమీకరణలు కూడా తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారని చెబుతున్నారు. వీర్రాజు గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజికవర్గ నేత అయితే విష్ణు రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గాలైన ఈ రెండు కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే పార్టీ బలోపేతమవుతుందని చెబుతున్నారట… పైగా రాయలసీమలో బీజేపీకి పెద్దగా పట్టులేకపోవడం వల్ల… తనకు చాన్స్ వస్తే ఆ ప్రాంతంలో పార్టీని విస్తరించే వీలుంటుందని పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు విష్ణువర్ధన్‌రెడ్డి.
గతంలో ఎమ్మెల్సీగా..
ఇక రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడైన వీర్రాజు… గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. 2014లో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్నారు వీర్రాజు. టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికైనా.. మిత్రపక్షాన్ని ప్రతిపక్షం కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారని విమర్శలు ఆయనపై ఉన్నాయి. దీంతో ఇప్పుడు మళ్లీ అవకాశం ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది.
ఐతే పొత్తు ధర్మంలో పార్టీ ఎవరి పేరు సూచిస్తే వారికే అవకాశం ఇవ్వాల్సివుంటుందని… పార్టీకి తాను చేసిన సేవలు, పార్టీ పెద్దల సూచనల మేరకు నడుచుకున్న తనకు తగిన న్యాయం జరుగుతుందని నమ్మకం పెట్టుకుంటున్నారు వీర్రాజు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించారు వీర్రాజు. కానీ, ఆయనకు చాన్స్ దక్కలేదు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేశారు. దీంతో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే రేసు నుంచి వీర్రాజు తప్పుకోవాల్సివచ్చింది. తన సీటు త్యాగం చేసినందున ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు వీర్రాజు.
ఇక విష్ణు సైతం హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని భావించారు. పొత్తుల్లో ఆ సీటు దక్కలేదు. దీంతో ఈ ఇద్దరూ పోటీకి దూరంగా ఉండిపోవాల్సివచ్చింది. దీంతో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో తొలి అవకాశం తమకు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఇద్దరి ఆశలను బీజేపీ హైకమాండ్ నెరవేరుస్తుందా? లేదా? అన్నదే పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిని కూటమి నాయకత్వం అంగీకరించడం కూడా ముఖ్యమని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఇద్దరూ ప్రస్తుతానికి వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.