Bhole Baba: జూలై 2న ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. నారయణ్ సకార్ హరి అలియాస్ భోలే బాబాకు సంబంధించిన ధార్మిక కార్యక్రమానికి లక్షల్లో జనాలు వచ్చారు. 80,000 మందికి అనుమతి ఉన్నప్పటికీ 2.5 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. భోలే బాబా పాదధూళి కోసం జనాలు ఎగబడటం, అదే సమయంలో ఆయన సెక్యూరిటీ జనాలను వెనక్కి నెట్టడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వందకు పైగా ప్రాణాలు పోయాయి.
తాజాగా ఈ ఘటనపై తొలిసారిగా భోలే బాబా స్పందించారు. ‘భూమి పుట్టిన వారు ఏదో రోజు చనిపోవాల్సిందే’ అని అన్నారు. జూలై 2 సంఘటన తర్వాత చాలా కలవరపడ్డానని, బాధపడ్డానని అన్నారు. కానీ అనివార్యమైన వాటిని ఎవరు నివారించగలరు..? అని ప్రశ్నించారు. ఈ భూమిపైకి వచ్చిన వారు సమయం వేరైనప్పటికీ ఏదో రోజు వెళ్లాల్సిందే అని అన్నారు. తన పేరు, ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నారని, సభ మధ్యలో ఏదో విషపూరితమైన పదార్థాన్ని స్ప్రే చేశారని ఆరోపించారు.
ఈ సంఘటనపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై విశ్వాసం వ్యక్తం చేసిన భోలే బాబా, కుట్రదారుల్ని ఉరితీయాలని అన్నారు. నిజం గెలుస్తుందని చెప్పారు. హత్రాస్ తొక్కిసలాటను దర్యాప్తు చేస్తున్న సిట్ కూడా దీని వెనక ‘కుట్ర కోణాన్ని’ తోసిపుచ్చలేదు. ఈ కేసులో కార్యక్రమ నిర్వాహకులు, అనుమతులు ఇచ్చిన అధికారులును దోషులుగా నిర్ధారించినప్పటికీ, భోలే బాబాపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. సిట్ నివేదికను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సర్కిల్ ఆఫీసర్, తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు ఇద్దరు స్థానిక పోలీసు అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ అధికారులను సస్పెండ్ చేసింది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.