సచివాలయంలో ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై చర్చించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. అలాగే.. అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ అంగన్ వాడీలలో విద్యాబోధనకు ఒక టీచర్ ను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సీఎం తెలిపారు.
ఇదిలా ఉంటే.. 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే యోచన చేస్తున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించనున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని ముఖ్యమంత్రి చెప్పారు.
దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా.. పదేళ్లుగా యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ లేదని విద్యావేత్తలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ కేటాయించాలని వారు కోరార. విద్యా, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి త్వరలో విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం తెలిపారు. విద్యా కమిషన్ ద్వారా విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.