రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
ప్రజాశక్తి-ప్రకాశం: పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ద్వేయమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా పేద ప్రజలకు రైతు బజార్లలో రాయితీపై నిత్యవసర సరుకులు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నామని మంత్రి అన్నారు. ఏ-గ్రేడ్ కందిపప్పు కిలో రూ.160, రెండు రకాల నాణ్యమైన సోనా మసూరి బియ్యాన్ని కిలో రూ.49కే ప్రజలకు అందిస్తున్నారు. ఒంగోలులోని మూడు రైతు బజార్లతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ కౌంటర్లు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. వైసిపి హాయంలో పెరిగిన నిత్యవసరధరలతో పేదలు అర్ధాకలితో అలమటించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు ఊరట కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి రూ.5 లకే పేదల ఆకలి తీరుస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
Source: Praja Sakti
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.