ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న కవిత స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అసుపత్రిలో చికిత్స అందించారు. తీవ్రమైన జ్వరంతో పాటూ, గైనిక్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు జైలు అధికారులు. చికిత్స నిమిత్తం మంగళవారం సాయంత్రం 4 గంటలకు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు చికిత్సలో భాగంగా రక్తనమూనాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటి నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్స అందజేశారు ప్రత్యేక వైద్య బృందం. వైద్యపరీక్షలనంతరం ఆమెను తిరిగి తిహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈడీతో పాటూ సీబీఐ కేసుల్లో కూడా కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అనేక బెయిల్ పిటిషన్లు వేసినప్పటికీ సీబీఐ, ఈడీ తరఫు వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ రిమాండుకు ఆదేశించింది. మార్చి 15న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తిహార్ జైలుకు తరలించారు. ఆ తరువాత ఏప్రిల్ 11న సీబీఐ కూడా ఈ కేసును దర్యప్తు చేపట్టేందుకు ముందుకు రావడంతో బెయిల్ మంజూరులో తీవ్ర జాప్యం ఏర్పడింది.
ఇప్పటికే 120 రోజులకు పైగా ఆమె జుడీషియల్ రిమాండులో ఉన్నారు కవిత. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారామె. విచారణ జరిపిన కోర్టు.. కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై పరిశీలించింది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పిటిషన్ విచారణను జులై 22కు వాయిదా వేసింది. జూలై 18 వరకూ జుడీషియల్ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. దీనికి కారణం ఆమెపై దాఖలు చేసిన చార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని వాదించారు కవిత తరఫు న్యాయవాది. దీనికి కౌంటర్ గా ఎలాంటి తప్పులు లేవని తెలిపారు సీబీఐ తరఫు న్యాయవాది. మద్యం పాలసీ కుంభకోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మాత్రమే కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు సీబీఐ తరఫు న్యాయవాదులు. అయితే కవిత డిఫాల్ట్ బెయిల్, సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది రౌస్ అవెన్యూ కోర్టు. దీనిపై స్పష్టమైన తీర్పు వస్తుందా లేదా అని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.