భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది : ఆర్థిక సర్వే
న్యూఢిల్లీ : సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం బిజెపి మిత్రపక్ష పార్టీల భాగస్వామ్యంతో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో వరుసగా మూడోసారి మోడీ ప్రధాని అయ్యారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 సంవత్సర బడ్జెట్‌ను లోక్‌సభలో రేపు (మంగళవారం) ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్‌కంటే ఒకరోజు ముందు సోమవారం 2023-24 ఆర్థికసర్వేను ఆమె సభలో ప్రవేశపెట్టారు. ‘భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది’ అని ఈ ఆర్థిక సర్వే తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ కోవిడ్ అనంతరం పుంజుకునేందుకు విధాన రూపకర్తలు చేసిన ప్రయత్నం ఆర్థిక స్థిరత్వాన్ని నిర్థారిస్తుందని ఈ సర్వే పేర్కొంది. ప్రపంచ అస్థిరతల నడుమ ‘అధిక వృద్ధి ఆకాంక్షలు కలిగిన దేశానికి ‘మార్పు’ మాత్రమే స్థిరంగా ఉంటుందని’ ఈ సర్వే చెప్పింది. వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణం వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ఒప్పందాలను చేరుకోవడం కష్టంగా మారింది. 2022 నుంచి ప్రయివేటు రంగం పెట్టుబడులు పెడుతున్నప్పటి నుంచి కొన్నేళ్లుగా ప్రభుత్వ పెట్టుబడులు మూలధనాన్ని కొనసాగించాయని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక గడచిన రెండు ంసవత్సరాలుగా 7.0 శాతం వృద్ధిరేటును నమోదు చేయగా.. 2024 ఆర్థిక సంవత్సరం అధికంగా 9.7 శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం ఉందని ఈ సర్వే తెలిపింది. కొన్ని నిర్దిష్ట ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటు పెరిగినప్పటికీ, ప్రధాన ద్రవ్యోల్బణం రేటు చాలావరకు నియంత్రణలో ఉంది. 2023 కంటే 2024లో వాణిజ్యలోటు తక్కువగా ఉంది. జిడిపిలో కరెంట్ ఖాతా లోటు దాదాపు 0.7 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరెంట్ ఖాతా మిగులును నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఈ ఆర్థిక సర్వే పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే సూచిస్తుంది.
2023-24 ఆర్థిక సర్వే ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించింది. ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో ఈ సర్వేను రూపొందించారు. ఇక ఆర్థికమంత్రిగా నిర్మలాసీతారామన్ ఏడవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఆర్థికమంత్రిగా ఉన్న మొరార్జీ దేశారు ఐదుసార్లు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఆయన రికార్డును నిర్మలాసీతారామన్ బద్దలుకొట్టనుంది.
Source: Praja Sakti
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.