Humanity ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు/ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు/…అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి/ చుట్టూ తిరుగుతున్నాడమ్మా’ అంటాడో కవి. పతనం అంచున ఊగిసలాడుతున్న మానవ సంబంధాల పట్ల కవి ఆవేదన ఇది. మనిషితనం మరచిపోయిన మనిషి ప్రవర్తన పట్ల ఒకింత జుగుప్స కలగక మానదు. ఒక మనిషి మరో మనిషిపై, ఒక జాతి మరో జాతిపై ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, దానికోసం ఎంతకైనా తెగించడం మాయమవుతున్న మనిషితనానికి నిదర్శనం. మనిషన్నవాడు- చెయ్యరాని చెడ్డా లేదు, చెయ్యలేని మంచీ లేదు. పాల్పడరాని స్వార్థమూ లేదు, సాధించలేని పరార్థమూ లేదు. దిగరాని నైచ్యమూ లేదు, అందుకోలేని ఉచ్ఛ స్థితీ లేదు. చెయ్యరాని నాశమూ లేదు, చెయ్యలేని నిర్మాణమూ లేదు. అందుకే అంటాడు పానుగంటి- ‘మనుష్యుడంత మాయకాడు మరియొకడున్నాడా? ముందునకు వాడే నడచును. ఆ కాళ్లతోనే వెనుకకునూ వాడే నడచును’ అని. మానవత్వం మంట కలిసిన ప్రతి చోటా… డబ్బు చుట్టే మనిషి జీవితం తిరుగుతుంటుంది. ఆ మనిషిని వెనుకుండి తిప్పే అతీత శక్తి ప్రపంచీకరణ. మనిషి తనను తాను మర్చిపోయి, స్వార్థంలో కూరుకుపోయి, నేను అనే స్వార్థపరతత్వంతో కూడిన వ్యవస్థను నిర్మిస్తున్నది ఈ మట్టికాళ్ల మహారాక్షసి ప్రపంచీకరణే.
Humanity తలకిందులవుతున్న సమాజ పోకడల్నీ, ధ్వంసమౌతున్న మానవ విలువల్నీ, మానవ సంబంధాల్నీ అంటుకట్టి బతికించుకోవాలి. ఎడారుల్లా, ఒంటరి ద్వీపాల్లా మిగిలిపోయే సంక్లిష్ట సమయాల్లోంచి, సంక్షుభిత సందర్భాల్లోంచి, సంకుచిత స్వభావాల్లోంచి మనిషి అలికిడి, మానవతా విలువలు మొలకెత్తాలి. ‘మనిషే నా కేంద్రం/ మనిషే నా సిద్ధాంతం/ అచ్చం మనిషిలానే జీవిస్తాను/ చివరకు మనిషిలానే మరణిస్తాను’ అంటూ మనిషితనాన్ని, మనిషి పట్ల మనిషికి వుండాల్సిన మానవతా బంధాన్ని కవిత్వీకరిస్తాడు కవి చిత్తలూరి. మనిషిలోని మానవత్వం గడ్డకట్టిందంటే.. జరగరానిదేదో జరిగినట్లు… మనిషి చుట్టూ పద్మవ్యూహం పన్నిన ప్రపంచీకరణే మాట్లాడుతున్నట్లు. అనేకానేక మాస్కులు తొడుక్కున్న కార్పొరేట్ సంస్కృతి మధ్య మానవ ముఖం సరికొత్తగా పుట్టుకురావాలి. ‘పాపాత్ముడు, పుణ్యాత్ముడు రాల్చే కన్నీళ్లకు తేడాలేదు. ప్రేమపూరిత హృదయం రక్తాశ్రువుల్ని రాలుస్తుంది’ అంటాడు కబీరు. ‘తనను అవమానించిన వ్యక్తిని ఉద్యోగంలోంచి తీసేయొద్దు…అతనికీ ఓ కుటుంబం వుంది’ అంటూ మనిషితనాన్ని చాటుకున్న ఆ రైతు హృదయం ప్రతి మనిషిలోనూ మొలకెత్తాలి. మానవ విలువల్ని పాదుకొల్పాలి.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.