2nd Phase Runa Mafi : కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు, రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టామని, త్వరలోనే విజయవంతంగా రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగానే పాలన ఉంటుందన్నారు. నేడు గురుపౌర్ణమి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో నిర్వహిచిన వేడుకలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ చల్లగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు, రైతులంతా సంతోషంగా ఉన్నారు. మొదటి విడత రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ కూడా మొదలు పెట్టాం. త్వరలోనే విజయవంతంగా రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. త్వరలో నిరుద్యోగుల కల కూడా నెరవేరబోతుంది. ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగా కాంగ్రెస్ పాలన ఉంటుంది’ అని అన్నారు.
పంట రుణాల మాఫీ పథకంలో తొలి విడతగా రూ.లక్షలోపు మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం 11,50,193 మంది రైతుల ఖాతాలకు రూ.6,098.93 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ.454.49 కోట్లు మాఫీ అయ్యాయి. రెండో విడతలో లక్షన్నర లోపు, మూడో విడతలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది. ఆగష్టు 15 వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.