హైదరాబాద్ బస్ భవన్లో శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరు.. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తోన్న కండక్టర్లు, డ్రైవర్లతో వర్చ్‌వల్‌గా సమావేశమయ్యారు. మహబుబాబాద్, హయత్ నగర్ -2, నిజామాబాద్-2, అసిఫాబాద్, హుస్నాబాద్, నారాయణపేట, మిర్యాలగూడ, మధిర, సిద్ధిపేట, సంగారెడ్డి డిపోలకు చెందిన సిబ్బందితో స్వయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోన్న సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఈ పథకాన్ని శుక్రవారం వరకు 68.60 కోట్ల మంది మహిళలు వినియోగించుకుని, రూ.2350 కోట్లను ఆదా చేసుకున్నామని ఆయన తెలిపారు. సంస్థలోని ప్రతి ఒక్క సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో చేస్తుండటం వల్లే మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని ప్రశంసించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు ఇప్పుడున్న సర్వీసుల కంటే మెరుగైన రవాణా సౌకర్యాలకు ప్రయాణికులకు కల్పించాలని అధికారులకు సూచించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సంస్థలో 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని, జాబ్ కేలండర్ ప్రకారం ఆయా పోస్టులను వీలైనంత త్వరగా ప్రభుత్వం భర్తీ చేస్తుందని వివరించారు. కొత్త బస్సుల కొనుగోలుతో మరిన్ని ఉద్యోగాలు సంస్థకు అవసరమవుతాయని, అందుకు ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదనలు పంపు తుందన్నారు.
ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం సహాయసహకారాలను అందిస్తోందని చెప్పారు. ఇప్పటికే 2017కు సంబంధించిన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. పెండింగ్లో ఆర్పీఎస్ బాండ్లకు సంబంధించిన రూ.200 కోట్లను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. విడతల వారీగా ఆర్టీసీ ఉద్యోగులు పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. సంస్థను మరింతగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు 38 డిపోల్లో లాభాల్లో ఉన్నాయని, మిగతా డిపోలు కూడా వృద్ధి సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కార్గో సేవలను విస్తరించేందుకు రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రయాణికులే వల్ల సంస్థ మనగలుగుతోందని, వారితో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. సంస్థను తమ కుటుంబంలా భావించి ముందుకు తీసుకెళ్లాలని, ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.