Minister Savitha: బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారుల్ని ఉపేక్షించబోనని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. వర్షాలు పడుతుండడం, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో తక్షణమే హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. తాగునీరు, భోజనం, వసతుల విషయంలో రాజీ పడకుండా చూసుకోవాలన్నారు. మన ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో హాస్టల్లోని పిల్లల విషయంలోనూ అదే విధమైన శ్రద్ధ చూపాలన్నారు.
ఇప్పటికే హాస్టళ్లలో పరిశీలన చేయగా, చాలా చోట్ల వసతులు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రధానంగా డయేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై చాలా చోట్ల ఫిర్యాదులు అందాయి. వసతుల విషయంలో రాజీ పడే అధికారులను ఉపేక్షించబోనన్నారు. అన్ని హాస్టళ్లలో కూడా విధిగా నిర్వహణ చర్యలు తీసుకోవాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించినపుడే వారు మరింత మెరుగ్గా చదువుకునే అవకాశం ఉంటుందని మంత్రి సవిత తెలిపారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.