Nipah Virus కోజికోడ్: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లాలో 14 ఏళ్ల వయసున్న ఒక బాలుడు నిఫా వైరస్ సోకి కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 10 రోజుల క్రితం ఈ బాలుడు నిఫా వైరస్ లక్షణాలతో అనారోగ్యం పాలయ్యాడు. కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉంచి చికిత్సందించారు. ఆదివారం ఈ బాలుడు మృతి చెందాడు. ఈ బాలుడి శాంపిల్స్ను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఆ శాంపిల్స్ను పరీక్షించగా ఆ బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు శనివారం నాడు నిర్ధారించారు. దీంతో.. ఆ బాలుడిని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడికి చికిత్సలో భాగంగా ఇవ్వాల్సిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ డోసులు పుణె నుంచి కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం చేరుకునే అవకాశం ఉంది. ఈలోపే నిఫా వైరస్ బాలుడి ప్రాణాలు తీసింది.
Nipah Virus
నిఫా వైరస్ మరణం నమోదు కావడంతో కేరళలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మలప్పురంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. నిఫా వైరస్ పొట్టనపెట్టుకున్న బాలుడి స్వగ్రామమైన పాండిక్కడ్ పంచాయతీలో లాక్డౌన్ విధించారు. కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ నిఫా వైరస్ కేసులపై మీడియాకు వివరాలు వెల్లడించారు. నలుగురిలో నిఫా వైరస్ లక్షణాలు కనిపించాయని, ఒకరికి వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆ నలుగురి శాంపిల్స్ను టెస్టింగ్కు పంపినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. నిఫా వైరస్ సోకి చనిపోయిన బాలుడితో అప్పటికి 240 మంది కాంటాక్ట్లో ఉండటంతో వారిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.
కేరళలో 2018 నుంచి నిఫా వైరస్ కలకలం మొదలైంది. పాజిటివ్ వచ్చిన పేషంట్స్లో ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2018లో కోజికోడ్లో ఒకరు, 2019లో కొచ్చిలో ఒకరు, 2023లో కోజికోడ్లో నలుగురు మాత్రమే నిఫా నుంచి కోలుకున్నారు. కేరళలో 2018లో 18 మందికి నిఫా వైరస్ సోకితే 17 మంది చనిపోయారు. 2021లో ఒకరు, 2023లో ఇద్దరు నిఫా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఇప్పుడు బాలుడు చనిపోవడం కేరళ ప్రజల్లో కలవరపాటుకు కారణమైంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.