ఆ మామా అల్లుళ్ళకు కళ్ళ ముందు కనిపించిన దారులన్నీ మూసుకుపోయాయా? రెంటికీ చెడ్డ ఆ నాయకులు ఇద్దరూ … ఇప్పుడు కొత్త దారి వెదుక్కుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించడంతో పాటు ఇష్టానుసారం నోటికి పని చెప్పిన మాజీ మంత్రి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారా? ఎవరా మామా అల్లుళ్ళు? ఏంటి వాళ్ళ రాజకీయ ఇరకాటపు కథ? అధికారంలో ఉన్నప్పుడు అడ్డే లేదన్నట్టుగా చెలరేగిపోయిన మాజీ మంత్రి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఇప్పుడు రకరకాల ఊహాగానాలు పెరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మల్లారెడ్డి అప్పట్లో విసిరిన చాలెంజ్‌లతో ప్రత్యర్థుల సంఖ్యను పెంచుకున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డితో వ్యక్తిగతంగా కూడా మల్లారెడ్డికి పొసగకపోవడంతో ఇప్పుడు రాజకీయంగా ఇరుకున పడుతున్నారట ఆయన. కాంగ్రెస్‌లో చేరడానికి హైదరాబాద్‌లో వర్కౌట్ కాలేదని ఆ మధ్య బెంగళూరు వెళ్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసినా… అది కూడా ఫలితం ఇవ్వలేదు. మాజీ మంత్రితో పాటు ఆయన అల్లుడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నా… ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తున్నాయి తప్ప లైన్ క్లియర్ అవడం లేదని అంటున్నారు. ఇక అదే సమయంలో ఆయన విద్యాసంస్థల్లో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం పూనుకోవడం, వరుసగా కేసులు పెడుతుండటం, తన నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరుతుండటం లాంటి కార్యక్రమాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట ఆయన. ఇంకా చెప్పాలంటే… రాజకీయంగా తనను ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతోందన్న భయంతో…ఇక హస్తం పార్టీతో చేతులు కలిపే యోచనను మల్లన్న విరమించుకున్నారన్న ప్రచారం ఉంది.కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్‌గా మారడంతో… ఇక అండ కోసం బీజేపీలో చేరాలనుకుంటున్నారని, ఆ పార్టీ ముఖ్యులతో టచ్ లోకి వెళ్లారని కూడా కొన్నాళ్ళు టాక్ నడిచింది. కానీ…. అట్నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడంతో… మరింత ఇరుకున పడ్డారని, ఎటూ పాలుపోని స్థితికి చేరారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. మా పార్టీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న తెలంగాణ బీజేపీ షరతుకు ఒప్పుకున్నా… కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో.. ఎందుకిలా నా ఖర్మ అని పాడుకోవడం ఈ మాజీ మంత్రి వంతవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్లాన్ A కింద కాంగ్రెస్, ప్లాన్ Bగా బీజేపీని ఎంచుకున్న మల్లారెడ్డికి ఆ రెండు పార్టీల నుంచి ప్రతికూల స్పందనే రావడంతో కొత్తగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
తాను పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన టీడీపీలో చేరడం ద్వారా… రెండు జాతీయ పార్టీలకు ఒకేసారి సమాధానం చెప్పాలనుకుంటున్నట్టు ప్రచారం మొదలైంది. తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా… ఆ పార్టీలో ఉంటే… తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నది మల్లారెడ్డి లెక్కగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కు లేకపోవడం కూడా తనకు కలిసివస్తుందని మాజీ మంత్రి అనుకుంటున్నారన్నది ఆయన సన్నిహితుల మాటగా తెలుస్తోంది. తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకువెళ్లి.. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు ఉండటం, కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడంతో తాను టీడీపీలో ఉంటే రాష్ట్రంలో పరోక్షంగా బీజేపీ మద్దతు ఉంటుందని భావిస్తున్నారట మల్లన్న. అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న సత్సంబంధాలు తనను కాపాడతాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణలోనూ తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్న టీడీపీ అధినాయకత్వం మల్లారెడ్డి లాంటి నాయకుడు చేరతానంటే కాదనదని ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. సన్నిహితులు కూడా ఆ ప్రతిపాదనకు సై అనడంతో… ఇక టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. టీడీపీలో చేరితే ప్రస్తుతానికి తనకు ఉన్న ముప్పు నుంచి తప్పించుకోవచ్చని.. నాలుగున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లోనూ బీజేపీతో అలయెన్స్‌తో రాజకీయంగా చక్రం తిప్పవచ్చనే అంచనాలో ఉన్నారట మల్లన్న. బీఆర్ఎస్ సమావేశాలకు కూడా ఇటీవల గైర్హాజర్ అవుతున్నారు మాజీ మంత్రి. ఎలాగూ పార్టీ మారే ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు ఈ మీటింగ్ లకు వెళ్లకపోతే ఏమవుతుందన్నది ఆయన వైఖరిగా చెప్పుకుంటున్నారు. మరి మల్లన్న తెలంగాణ టీడీపీలో కీలకంగా మారతారా? లేక అక్కడ కూడా ఏవైనా అడ్డంకులు వచ్చి మేటర్ ఆగిపోతుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.