అభివృద్ధి ప్రాజెక్టు అనేది నిర్మాణం అయితే అక్కడ ప్రజల జీవన స్థితిగతులు పెరగాలి. విద్య, వైద్యం, ఆదాయ మార్గాల్లో మార్పులు రావాలి. కానీ ఆచరణలో దానికి వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని వదులకుంటున్నారో వారంతా భూమి, ఉపాధి, ఇళ్లు, ఆస్తులు కోల్పోయినవారుగానూ, ఆహార భద్రతలేని వారుగానూ మిగిలిపోతున్నారు. ఏ దేశమైనా, ప్రపంచమైనా అభివృద్ధి చెందాలంటే ప్రాజెక్టులు కీలకం అనడంలో సందేహం లేదు. అదే సమయంలో వాటి నిర్మాణానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరే సమస్యగా మారుతోంది. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన ప్రజలు మనుషులే కాదన్నట్లు వ్యవహరించడం.. విధాన నిర్ణాయక ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. ఇప్పటి వరకూ ప్రాజెక్టులు కట్టిన ప్రాంతంలో ఎక్కువగా నష్టపోయింది గిరిజనులే. ముంపు నుంచి బాధితులను ఆదుకోవడం అత్యంత కీలకమైన విషయం. ఈ నెల 25వ తేదీన ‘ప్రపంచ ముంపు నివారణ’ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
దేశంలో వివిధ ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన మొత్తం కుటుంబాలలో 40 శాతం మంది గిరిజనులేనని ప్రభుత్వ నివేదికలే ఘోషిస్తున్నాయి. వారైతే నోరెత్తరు, అడగలేరు అనే పద్ధతుల్లో ప్రభుత్వాలు ఇష్టారీతిగా చేసుకుపోతున్నాయి. మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కడుతున్న తీరు, అక్కడ నిర్వాసితుల పట్ల రాజ్యాంగ యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలు అజ్రాస్వామికంగానూ, అమానవీయంగానూ ఉన్నాయి. నిర్వాసితులకు న్యాయం చేయకుండా ప్రాజెక్టును పూర్తి చేయడంతో గోదావరి నదికి వచ్చిన వరదల్లో గిరిజన గ్రామాలు పూర్తిగా నీటకొట్టుకుపోయాయి. న్యాయం జరగక, భూమిని వదులుకోలేక, వదులుకుంటే బతకలేమనే భయంతో అమాయక గిరిజనులు అక్కడే కొండల్లో, కోనల్లో గుడారాలు వేసుకుని – బతుకీడ్చుతున్నారు. వారి బాధలు చూసిన ఇతర ప్రాంతాల ప్రజల్లోనూ పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అది ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. అంతకుముందు నర్మదా బచావో ఆందోళన (ఎన్‌బిఏ) నిర్వాసితుల పట్ల, గిరిజనుల పట్ల ప్రభుత్వాలు అనుసరించిన తీరు ఒక కేస్ స్టడీగా మన ముందు వుంది. పునరావాసం ఫస్ట్, ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణం అనే డిమాండ్ నేడు ముందుకొచ్చింది.
నిర్వాసితులే కీలకం..
దేశంలో స్వాతంత్య్రానంతరం నగరాల విస్తరణ, రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టులు, డ్యాములు, పెద్దపెద్ద సంస్థల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు వంటి వాటితో గత 50 ఏళ్లుగా లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. కొంతమందినయితే ఒకటికి రెండు మూడుసార్లు కూడా నిర్వాసితులుగా వేర్వేరు ప్రాంతాలకు తరలించబడ్డారు. ఇక్కడ ప్రాజెక్టుల అభివృద్ధి సమస్యను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. పెట్టుబడిదారులకు రాజకీయ నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. అదే సందర్భంలో భూములిచ్చిన వారిని రోడ్డున పడేస్తున్నాయి. ఒక ప్రాంతం నుండి తరలిపోవడం వల్ల అప్పటి వరకూ ఉన్న ప్రజానిర్మాణ వ్యవస్థలు, ఉత్పత్తి రంగాలు, సంప్రదాయ ఆదాయ వనరులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. సాంస్కృతిక గుర్తింపు, సామాజిక బంధాలు, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఏ ప్రాజెక్టు నిర్మించినా మొత్తంగా 26.6 శాతం మాత్రమే పునరావాస కల్పన జరుగుతోందని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. దేశంలో స్వతంత్రం వచ్చిన తరువాత ఇప్పటివరకూ ఏడుకోట్ల మంది నిర్వాసితులయ్యారనేది ఒక అంచనా.
మరిన్ని ఇబ్బందుల్లోకి..
ప్రాజెక్టుల పరిధిలో నుండి నిర్వాసితులను తరలించే క్రమంలో వారికి కనీస సదుపాయాలు కల్పించడంలో సంబంధిత అథారిటీలు అనాగరికంగా వ్యవహరిస్తున్నాయి. తాత్కాలిక వసతులు కల్పించి, అక్కడకు వెళ్లిపోవాలని చెబుతున్నారు. లేకపోతే బలవంతంగా ముంపును సృష్టిస్తున్నారు. తద్వారా ఇళ్లను ముంచేసి ప్రజలను అక్కడ నుండి పంపించేయడం వంటి చర్యలకు అధికారులు పూనుకుంటున్నారు. కనీస సదుపాయాలు లేని ప్రాంతాల్లో నివసించడం సాధ్యం కాకపోవడంతో బాధితులు చాలాచోట్ల తాము వెళ్లమని ఎదురుతిరుగుతున్నారు. ఆర్‌అండ్‌ఆర్ యాక్టు ప్రకారం వారికి కల్పించాల్సిన సదుపాయాలు అక్కడ లేకపోవడం – సాగు భూమిని, నీటి సదుపాయాలతో కల్పించడం వంటి చర్యలేవీ ప్రభుత్వాలుగానీ, ప్రాజెక్టు అథారిటీలుగానీ చేయడం లేదు. చట్ట ప్రకారం చేయాల్సిన చోట దాన్నుండి బయటపడేందుకు రకరకాల చట్టాలు తీసుకురావడం – దాని ప్రకారం ప్రజలను బలవంతంగా పంపించేయడం చేస్తున్నారు. అంతేకాదు వారి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కింద ఎంతోకొంత జమచేసి ఇక మీరు ఖాళీ చేయండంటున్నారు. దీనితో బాధితులకు తెలియకుండానే కోర్టును ఆశ్రయించి, వారికున్న బలంతో నిర్వాసితులను నట్టేట ముంచుతున్నారు. దీనికి కృత్రిమంగా సృష్టించే ముంపును లేదా ప్రకృతి విపత్తు వల్ల వచ్చే ముంపును సాకుగా చూపుతున్నారు. స్వాతంత్య్రం అనంతరం పాలకులు విద్యుత్, నీటిపారుదల కోసం ఆనకట్టలు, రిజర్వాయర్లు, పట్టణీకరణ, మైనింగ్, థర్మల్ పవర్ ప్లాంట్లు, ఇతర మెరుగైన సదుపాయాలను చేపడితే సాధ్యమవుతుందని భావించి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ప్రజల జీవితాలను మెరుగుచేయడం కోసం చేపట్టారు. ప్రపంచంలో ప్రతి ఏటా 1.5 కోట్ల మంది ప్రజలు తమ గ్రామాలు, ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తోందని ఒక అంచనా.
నిర్మాణానికి ముందే..
ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే ముందుగా ఆ ప్రాంతంలో నివసించే వారిని తరలించాలనే కనీస స్ఫృహ ప్రభుత్వానికి కొరవడింది. మరో ప్రాంతంలో సాగు భూమి తయారవుతుందనే పేరు చెప్పి – అప్పటికే శతాబ్దాలు, దశాబ్దాల తరబడి బతుకుతున్న ప్రజలను తరిమేస్తున్నారు. అలా తరిమివేయబడ్డవారూ మనుషులే అనే ఇంగితజ్ఞానాన్ని పాలకులు మర్చిపోతున్నారు. పైగా మరొక ప్రాంత అభివృద్ధిని వీరందరూ అడ్డుకుంటున్నారనే ఒక ప్రచారాన్ని తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తూ రాజ్యాంగ యంత్రాంగాన్ని పనిలో దించడం చకచకా జరిగిపోతున్నాయి.
నిర్వాసితుల కోసం 2013కు ముందు బలమైన చట్టాలు లేకపోవడం, ప్రాజెక్టు అథారిటీలు, ప్రభుత్వం చెప్పిందే వేదంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం 2013లో పునరావాసం, పునర్నిర్మాణం చట్టాన్ని (ఆర్‌అండ్‌ఆర్ యాక్టు) తీసుకొచ్చింది. ఈ యాక్టు అమల్లో ఉన్నప్పటికీ చాలా రాష్ట్రాలు, వ్యవస్థలు వారు ప్రాజెక్టులు చేపట్టదలుచుకున్న చోట సొంత ఆర్‌అండ్‌ఆర్ చట్టాన్ని ఏర్పాటు చేసుకుని, వాటి ఆధారంగా పునరావాసాన్ని అమలు చేస్తున్నాయి.
ఒకవేళ ప్రాజెక్టు ముంపు లేదా ప్రభావిత ప్రాంతం నుండి తరలించాల్సి వస్తే తక్కువ నష్టం జరిగేలా చూడాల్సి ఉంటుంది. అంటే బాధితులకు న్యాయబద్ధమైన పరిహారం, సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి కమ్యూనిటీల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వారికి మెరుగైన సదుపాయాలతో కూడిన పునరావాసం కల్పించాలి. సాధారణ ప్రాంతాల్లో 400 కుటుంబాలు, కొండ ప్రాంతాల్లో 200 కుటుంబాలను తరలించాల్సిన పరిస్థితి ఉంటే – అక్కడ సామాజిక ప్రభావ, పర్యావరణ ప్రభావ అంచనానూ రూపొందించాలి.
నిర్వాసితులు అనబడే వారందరూ భవిష్యత్తరాల బాగు కోసం, లక్షల మంది ప్రజల మంచికోసం, ఉపాధి కోసం, దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం వారి జీవితాలను త్యాగం చేస్తున్నారు. సహజంగా ఏదయినా వదులుకుంటే వారిని పొగడ్తలతో ముంచెత్తుతాము. త్యాగధనులుగా కీర్తిస్తాము. కానీ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా బాధితులను నేరస్తులుగానూ, అభివృద్ధి నిరోధకులుగానూ ప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి దుర్మార్గ పద్ధతులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. తద్వారా వారనుకున్న పనిని ఇష్టారాజ్యంగా చేసుకుపోతున్నారు. ఉదాహరణకు ఏ మైక్రోసాఫ్టో, జియోనో, లేదా ఇంకో కంపెనీయో ప్రజలతో వ్యాపారం చేసి, వారికి వచ్చిన లాభాల్లో నండి 0.5 శాతం నుండి ఒక శాతం ప్రజలకు ఇస్తున్నట్లు ప్రకటిస్తాయి. ఇక్కడ వారు కోల్పోయేది ఏమీ ఉండదు. కొండల్లా వచ్చిన లాభాల్లో నుండి గడ్డిపరకలాంటి లాభాన్ని ఇచ్చి, మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటారు. దాన్ని నెత్తినెత్తుకుని ప్రచారం చేస్తుంటారు సోకాల్డ్ మేధావులు. వీరివల్ల ఒక ప్రాంతం అభివృద్ధి చెందదు. ఒక మనిషికి ఉపయోగం ఉండదు.. పైగా నష్టాలే. కానీ ప్రాజెక్టులు కట్టడం వల్ల నష్టపోయే ప్రజలు వారి జీవితాలను భవిష్యత్తరాల కోసం దానం చేస్తున్నారు. వారిని కాపాడుకోవాల్సింది ప్రజలే. కానీ అదే ప్రజలను నిర్వాసితులపైకి ఉసిగొల్పుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు ప్రస్తుత రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీల యజమానులు.
తప్పుడు లెక్కలు..
నోరులేని అమాయక గిరిజనులను బలవంతంగా తరిమేయడం, బెదిరించడం వంటివి చేస్తున్నారు. కడుపు మండి ప్రతిఘటిస్తే తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఏ ప్రాజెక్టు చేపట్టినా అన్నింట్లోనూ ఒక అంశం స్పష్టంగా కనిపిస్తోంది. నష్టపోయేవారి సంఖ్య తక్కువగా చేసి చూపించడం ప్రభుత్వాలు ఆనవాయితీగా పెట్టుకున్నాయి. ఫరక్కా థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో అక్కడ 6,300 కుటుంబాలు నిర్వాసితులయ్యారు. బార్గి ప్రాజెక్టులో 162 కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. నిర్వాసితులైన వారందరూ ”యుద్ధాలు మిగిల్చిన శరణార్థులే” అని 1999లో అరుంధతీరారు చేసిన వ్యాఖ్య పెద్ద చర్చకు దారితీసింది. నిర్వాసితుల్లో ఎక్కువ మంది గ్రామీణ పేదలే ఉన్నారు. ఇక్కడో సామాజికాంశం ఏమిటంటే దేశంలో నిర్వాసితుల్లో ఎక్కువమంది గిరిజనులే. మొత్తం నిర్వాసితుల్లో 40 శాతం మంది వారే.
చట్టం అమలు చేయాలి..
కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం పునరావాసం, పునర్నిర్మాణ చట్టాన్ని 2013లో తీసుకొచ్చింది. దీని ప్రకారం గ్రామంలో ఉన్న భూములున్నవారితో పాటు, భూమిలేని వారికి, కౌలుదారులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి. పునర్నిర్మాణం చేసే స్థలంలో పాఠశాలలు, విద్యుత్, మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలి. పెసా చట్టానికి లోబడి ఉండాలి. షెడ్యూలు ప్రాంత ప్రజల హక్కులు కాపాడాలి. ఈ చట్ట స్ఫూర్తిని నీరుగార్చుతూ తరువాత కొన్ని సవరణలు తీసుకొచ్చారు.
నర్మదా బచావో ఆందోళన
ఇది ప్రపంచంలోనే పెద్ద ఆందోళన. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో నర్మదానదిపై పెద్దఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. మేధాపాట్కర్ ”నర్మదా బచావో ఆందోళన” పేరుతో ఉద్యమించారు. నర్మదా ప్రాజెక్టు వల్ల ఎక్కువమంది గిరిజనులు నష్టపోతారని ప్రపంచానికి తెలిపింది. ఇప్పటికీ ప్రపంచంలో నిర్వాసితుల తరుపున జరిగిన అతిపెద్ద ఉద్యమంగా ఇది నిలిచింది. దీనిలో 30 మేజర్, 135 మీడియం, రెండు మెగా డ్యాములు నిర్మించాలని తలపెట్టారు. దీనిలో ప్రభుత్వం 42 వేల కుటుంబాలు మాత్రమే నిర్వాసితులవుతాయని ప్రకటించింది. నర్మదా బచావో ఆందోళన తరువాత 85 వేల కుటుంబాలు ఉన్నాయని, ఐదు లక్షల మంది ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. ఇక్కడ ప్రాజెక్టులు కట్టడం వల్ల వచ్చే ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని అప్పట్లో మేధాపాట్కర్ వాదించారు.
ప్రపంచాన్ని నివ్వెరపరిచిన పోలవరం గిరిజన గోడు
పోలవరం ప్రాజెక్టును 1941లో వెంకటకృష్ణ అయ్యంగార్ ఆధ్వర్యాన 150 టిఎంసిల సామర్థ్యంతో ప్లాను చేశారు. 1942-44 మధ్య ప్రాథమిక సర్వేలు పూర్తి చేసి స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో జె.ఎల్.సావేజ్, డాక్టర్ కార్ల్ తెర్జాఘి, ఎస్.ఓ.హార్పర్, సర్ ముద్దాక్ మెక్‌డోనాల్డ్ అనే నలుగురు ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ వేశారు. 1942లో ప్రాథమిక సర్వేలు, 1951లో సమగ్ర సర్వేల అనంతరం రూ.129 కోట్ల అంచనాతో ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. అనంతరం అడుగు ముందుకు పడలేదు. 1953లో వచ్చిన భారీ వరదలు, విశాఖ స్టీలుప్లాంటు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదికను తయారుచేసింది. 1976లో ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ కోసం ఇరిగేషన్ విభాగంలో కొత్త సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. 1978లో తుది నివేదికను తయారు చేసింది. 1980లో గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిచ్చింది. శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదు. ప్రసుత్తం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామాయంపేట గ్రామంలో దీన్ని నిర్మిస్తున్నారు.
పెండింగ్‌లో 60,258 ఎకరాలు..
ప్రాజెక్టు కోసం 1,62,739.53 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,02,481.18 ఎకరాలు సేకరించారు. ఇంకా 60,258.35 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
రాష్ట్రాల వారీగా నిర్వాసితులు
దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి వేర్వేరు రంగాలకు భూమి సేకరణ సమయంలో పెద్దఎత్తున ప్రజలను తరలించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, ఒరిస్సా, అస్సాం, బెంగాల్, గుజరాత్, గోవా వున్నట్లు పార్లమెంటుకు ప్రభుత్వం గతంలో తెలియజేసింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లో 1951-95 మధ్య 32,15,620 మంది, జార్ఖండ్‌లో 15,48,017 మందిని తరలించారు. 1947-2000 మధ్యకాలంలో కేరళలో 5,52,233, ఒరిస్సాలో 14,65,909 మందిని తరలించారు. 1947-2004 మధ్య అస్సాంలో 1918874 మందిని, బెంగాల్లో 69,44,492 మందిని తరలించారు. అలాగే 1965 -95 మధ్యకాలంలో గుజరాత్‌లో 40,75,051 మందిని, గోవాలో 60,913 మందిని మొత్తంగా 1,97,81,109 మందిని తరలించారు.
గిరిజనులే ఎక్కువ..
పార్లమెంటుకు 2013లో సమర్పించిన నివేదిక ప్రకారం 1999 నాటికి ఎపిలో 15 ప్రాజెక్టులకుగాను 3,16,242 మందిని తరలిస్తే- వీరిలో 1,23,946 మంది గిరిజనులే ఉన్నారు. మహారాష్ట్రలో 11 ప్రాజెక్టులకుగాను 1,51,408 మందిని తరలిస్తే వారిలో 20,534 మంది గిరిజనులు. ఒరిస్సాలో 11 ప్రాజెక్టుల్లో 64,674 మందిలో 42,036 మంది గిరిజనులే ఉన్నారు. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల్లో మొత్తం ప్రాజెక్టుల వివరాలు తీసుకుంటే 60 ప్రాజెక్టుల్లో 6,65,131 మందిని తరలించాల్సి వస్తే వారిలో 2,25,708 మంది గిరిజనులే. ఈ వివరాలను ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం వెల్లడించింది. అత్యధిక ప్రాజెక్టులు వెనుకబడిన ప్రాంతాల్లోనే ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలో ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వంటి మేజర్ ప్రాజెక్టుల్లో ఇప్పటికీ నిర్వాసితులకు న్యాయం జరగలేదు. పులిచింతల ప్రాజెక్టులో నీరు నిలపడంతో తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రజలు తరలిపోయారు.
చైనా త్రీ గోర్జెస్ ప్రాజెక్టు ప్రత్యేకం..
హ్యూబే ప్రావిన్స్‌లోని యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మించారు. దీనికి ప్లాను 1992లో రూపొందించారు. ఇది 2009లో ఉపయోగంలోకి వచ్చింది. దీనికి ఐదు ట్రిలియన్ గ్యాలన్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌గా పేర్కొంటూ త్రీగోర్జెస్ నిర్మాణంలో చైనా అనుసరించిన విధానం ప్రపంచానికే ఆదర్శనీయం.. అనుసరణీయం. ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందే సుమారు 8.70 లక్షల మందికి సకల సదుపాయాలతో కూడిన ఒక టౌన్‌షిప్‌ను నిర్మించారు. దానిని పొరుగునే ఉన్న చిన్నపాటి పట్టణంతో అనుసంధానించడంతో అదొక పెద్ద నగరంగా మారింది. అయితే ఇక్కడ ప్రజలను తరలించేందుకు మొదట అనేక ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. వాటిల్లో ఒకటి సాగుభూమి చేసుకుంటున్న రైతులను ప్రస్తుతం ఉన్న ముంపు ప్రాంతం నుండి సాగుకు అనువైన ప్రాంతానికి తరలించడం. రెండోది పునరావాసులను తీసుకెళ్లి పట్టణాల్లో కలపడం. అయితే వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని నిపుణులు భావించారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా కొంత మొత్తాన్ని చెల్లించి, వారిని పునరావాస కాలనీకి తరలించాలని నిర్ణయించారు. వారికి ప్రాజెక్టు పూర్తయిన తరువాత అక్కడ ఏర్పాటు చేసే పర్యాటక, ఇతర ఆర్థిక ఆదాయ ప్రాజెక్టుల నుండి వచ్చే లాభాల్లో కొంత మొత్తాన్ని పొందేలా ఏర్పాటు చేశారు. దీనికోసం అక్కడ పర్యాటక ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మరోవైపు ప్రాజెక్టు పూర్తయిన తరువాత చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణీకరణ వేగవంతమైంది.
వల్లభనేని సురేష్
9490099208
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.