ప్రస్తుతం భారతీయ వాణిజ్య మార్కెట్ మొత్తం కేంద్ర బడ్జెట్ గురించి కోటి ఆశలతో చూస్తున్నారు. ఇటీవల కాలంలో బడ్జెట్ అంటే అన్ని రంగాలకు కలిపి ఇస్తున్నారు. అయితే గతంలో రైల్వేకు ప్రత్యేకంగా ఓ బడ్జెట్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అవును మీరు వింటున్నది నిజమే 2016కు ముందు వరకు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవారు. 2016లో సాధారణ బడ్జెట్‌తో రైల్వే బడ్జెట్ విలీనానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత భారతదేశం 2017లో ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను సమర్పించడం ఆపేసింది. ఈ నిర్ణయం ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్‌ను సమర్పించే 92 ఏళ్ల పద్ధతికి ముగింపు పలికింది. ఈ నేపథ్యంలో రైల్వే బడ్జెట్ ఏయే కారణాల నిలిపివేశారో? మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
భారతదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1924లోనే ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొదలు పెట్టారు. అయితే 92 ఏళ్ల తర్వాత 2017లో రైల్వే బడ్జెట్ మొదటిసారిగా సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు ముగింపు పలకాలని నీతి ఆయోగ్ కమిషన్ సిఫార్సు చేసింది. అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు ఈ సిఫార్సును స్వీకరించి భారత ఆర్థిక వ్యవస్థకు, రైల్వేలకు మేలు చేసేలా రైల్వే, కేంద్ర బడ్జెట్‌లను కలపాలని అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఆయన ప్రతిపాదనను అరుణ్ జైట్లీ 2016లో రాజ్యసభలో లేవనెత్తారు, ఇది రెండు బడ్జెట్‌ల ఏకీకరణను ప్లాన్ చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.
అక్వర్త్ కమిటీ సిఫార్సుల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వ వలస పాలనా విధానం ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. మొదటి రైల్వే బడ్జెట్ 1924లో ప్రవేశపెట్టినప్పుడు భారతదేశం అన్ని ఇతర పరిపాలనా విభాగాలపై ఖర్చు చేసిన దానికంటే రైల్వేల నిర్వహణకు ఎక్కువ డబ్బు అవసరం అయ్యేది. ఈ విధానం విదేశీ పెట్టుబడులను, ముఖ్యంగా భారతీయ రైల్వేలలో బ్రిటిష్ పెట్టుబడులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుని తీసుకొచ్చారు. అయితే ఆ విధానం ప్రస్తుత పాలనకు అవసరం లేదని భావించి ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే విధానానికి స్వస్తి పలికారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.