మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. తనదైన నటన, డ్యాన్సులు, ఫైట్లతో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇందులో అతను చేసిన డ్యాన్సులు, ఫైట్స్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి. ఇలా సినిమాల్లో గ్లోబల్ స్టార్ గా ఓ రేంజ్ లో వెలిగిపోతోన్న రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కనుందని సమాచారం.
అదేంటంటే.. లండన్ లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ పాపులారిటీ, ఫాలోయింగ్ ను గమనించిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ కు వెళ్లిపోయాడు రామ్ చరణ్. అక్కడ తన విగ్రహ తయారీకి కావలసిన కొలతలను ఇచ్చినట్టు సమాచారం. ఇక మేడమ్ టుస్పాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసే రామ్ చరణ్ మైనపు విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. రామ్‌చరణ్ ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందిన కుక్క పిల్ల రైమ్‌ను తనతో పెంచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా రైమ్‌ను తీసుకెళ్లడం రామ్‌చరణ్ దంపతులకు అలవాటు. అందుకే ఇప్పుడు కూడా రైమ్‌ను ఎత్తుకుని ఉన్న రామ్‌చరణ్ మైనపు బొమ్మనే మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.