టీడీపీకి గట్టిపట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి… అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పదికి పది స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది సైకిల్‌పార్టీ… ఇక పార్లమెంట్ స్థానంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిని వరుసగా మూడోసారి గెలిపించారు సిక్కోలు ఓటర్లు. గత ఐదేళ్లు జిల్లాను శాసించిన వైసీపీ… టీడీపీ కార్యకర్తలను వేధించిందనే కసి పెంచుకున్న… సైకిల్ సైనికులు ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తమ ప్రతాపం చూపారు.
ఐతే ఎన్నికల్లో గెలిచామనే సంతృప్తి కార్యకర్తల్లో కానీ, ఎమ్మెల్యేల్లో కానీ ఎక్కడా కనిపించడం లేదని చెబుతున్నారు. దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించని చందంగా తమ పరిస్థితి లోలోన మదనపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి… ఇంతకీ సిక్కోలు టీడీపీకి వచ్చిన సమస్యేంటి?
పార్టీ క్యాడర్‌ను సంతృప్తి పరచలేక..
అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాను క్లీన్‌స్వీప్ చేసిన జోష్… పార్టీ క్యాడర్‌ను సంతృప్తి పరచలేకపోతోందని అంటున్నారు. జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచానా… కేంద్రమంత్రితోపాటు రాష్ట్రమంత్రి పదవి కట్టబెట్టినా… ఇంకేదో సాధించలేకపోయామనే ఆవేదన ఆ పార్టీలో కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలు, నాయకులు బాధను పార్టీ అధిష్టానం అర్థం చేసుకోలేకపోతోందని వాదన వినిపిస్తోంది.
చేతికి అధికారం వచ్చినా, తాము ఆ అధికారం చలాయించలేకపోతున్నామని ఎమ్మెల్యేలుతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అధికారులను కట్టుదిట్టం చేయడంతో గెలిచిన ఆనందం టీడీపీని సంతృప్తి పరచలేకపోతోందంటున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 40 రోజులు కావస్తున్నా, తమకు అనుకూలమైన అధికారులను నియోజకవర్గానికి తెచ్చుకోలేకపోయామని ఎమ్మెల్యేలు నిట్టూరుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత నెల 4న ఫలితాలు రాగా, 12న సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే వారం రోజుల్లో జిల్లాలోని కొన్ని బదిలీలు జరిగాయి.
ఆశలపై నీళ్లు జల్లినట్లు..
ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులు, పోలీసులకు స్థానచలనం కల్పించారు. టెక్కలిలో మార్పులతో జిల్లావ్యాప్తంగా ప్రక్షాళన ఉంటుందని ఆశించిన ఎమ్మెల్యేలకు ఆశాభంగమే ఎదురైందంటున్నారు. టెక్కలిలో మొదలైన బదిలీల ప్రక్రియ తమ నియోజకవర్గాల్లోనూ కొనసాగించాలని ఎమ్మెల్యేలు ఆశించగా, హైకమాండ్ ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు జల్లినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత తనకు తెలియకుండా ఎలాంటి మార్పులు చేయొద్దని ఆదేశించడంతో ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్ అన్నట్లు పరిస్థితి మారిపోయింది. సదరు ముఖ్యనేత నిర్ణయంతో ఎమ్మెల్యేలు కూడా ఉసూరుమంటున్నారు. అధికారం వచ్చినా, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే కొనసాగడం వల్ల చిన్నచిన్న ఇబ్బందులను సైతం అధిగమించలేకపోతున్నామని టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీ వర్గాల సమాచారం
కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు మాత్రమే..
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా బదిలీలు జరగలేదు. ప్రస్తుతానికి కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు మాత్రమే జరిగాయి. డీఎస్పీ, ఆర్డీవో స్థాయి అధికారులను మార్చిన తర్వాత మండలస్థాయి అధికారుల మార్పు ఉంటుందని చెబుతున్నారు. ఐతే గతం నుంచి ఆయా మండలాలు, సర్కిల్ కేంద్రాల్లో పనిచేసిన ఎస్‌ఐలు, సీఐ స్థాయి అధికారుల వల్ల క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక వారిని బదిలీపై పంపడం ఆలస్యం అవుతుండటం వల్ల ఇప్పటికీ ప్రత్యర్థుల మాటే చెల్లుబాటు అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.
తమ మండలాలు, సర్కిల్స్‌లో పోలీసుతోపాటు రెవెన్యూ, హౌసింగ్, మండల పరిషత్ అధికారులను మార్చాల్సిందిగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారు. ఐతే కార్యకర్తల వినతులను వింటున్న ఎమ్మెల్యేలు… ముఖ్యనేత విధించిన ఆంక్షలతో ఏ పనీ చేయలేక…. ఆ విషయం చెప్పలేక సతమతమవుతున్నారంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు జరిగే వరకు వేచిచూడాల్సిందిగా క్యాడర్‌కు నచ్చజెపుతున్నారు. జిల్లాలో ముఖ్యనేతకు పార్టీలో సూపర్ పవర్ ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. సరికదా… సదరు నేతను కలిసి తమ సమస్యను తెలియజేయడానికి కూడా జంకుతున్నారు. దీంతో దేవుడు కరుణించినా, పూజారి వరమివ్వలేదన్నట్లు తయారైందని కార్యకర్తలు వాపోతున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.