నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, ఆయా పార్టీలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జులై 22న తిరిగి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలను కనిపించకుండా చూడాలని సూచించింది.
నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని సందర్భంగా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వాదనలు కొనసాగాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం, ప్రశ్నపత్రం లీకేజీ కేవలం పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైనట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది.
అయితే గుజరాత్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పేపర్ లీక్ కొన్ని కేంద్రాలకే పరిమితమైందా? లేదా ఇతర కేంద్రాలు, దేశవ్యాప్తంగా వ్యాపించిందా? అనే విషయాలు తెలిసేందుకు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచడం కీలకమని వ్యాఖ్యానించింది. అయితే విద్యార్థుల గోప్యత దృష్ట్యా వారి వివరాలు కనిపించకుండా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.