నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. ఆసుపత్రి కారిడార్‌లో తండ్రితోపాటు నిద్రిస్తున్న బాలుడు కనిపించకపోవడం సంచలనంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాక్లూర్ మండలం మానిక్ భండార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య ప్రసూతి కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడితోపసాటు ఆస్పత్రి కారిడార్‌లో నిద్రించాడు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి వద్ద నిద్రిస్తున్న బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్ర లేచిన బాలుడి తండ్రి తన పక్కలో ఉండాల్సిన బాబు కనిపించక పోయేసరికి కంగారుపడ్డాడు. ఆస్పత్రి పరిసరాల్లో ఎంత వెతికినా జాడ కనిపించలేదు.
దీంతో తన కొడుకును ఎత్తుకెళ్లునట్లు అనుమానంతో ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్పత్రిలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. బాలుడిని ఎటు వైపు తీసుకెళ్ళారనే విషయాన్ని తెలుసుకోడానికి ఆస్పత్రి పరిసరాల్లో, బస్టాండు, నగరంలోని పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
గతంలో కూడా జీజీహెచ్‌లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.