హైదరాబాద్, జులై 18: తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు ఈ రోజు (జులై 18) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు దాదాపు 13 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2,79,966 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచగా.. జులై 16న సాయంత్రానికి 2,40,727 మంది అభ్యర్ధులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. రోజుకు రెండు విడతల చొప్పున ఈ పరీక్షలు జరుగుతాయి.
మొదటి విడత ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో విడుత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పీఈటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. దివ్యాంగ అభ్యర్థులకు దనపు సమయం కేటాయిస్తారు. ప్రతి రోజు 26 వేల మందికి చొప్పున పరీక్షలు జరుగుతాయి. హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయని కొందరు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వస్తున్నారని విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వారందరిక హాల్ టికెట్లలో తప్పులను సరిదిద్ది అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఇక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు కనీసం 2 గంటల ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు.
నిర్ణీత సమయానికి గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అలాగే పరీక్ష సమయానికంటే 10 నిమిషాల ముందుగానే గేట్లు మూసివేస్తామని తెలిపారు. ఇక ఈ రోజు డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానుండగా.. మరోవైపు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్ధులు నిరసనలు ఉద్రిక్తం చేస్తున్నారు. దీంతో అసలు పరీక్షలు జరుగుతాయో లేదోనన్న సందిగ్ధం అభ్యర్ధుల్లో నెలకొంది. డీఎస్సీ వాయిదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పిటీషన్‌ను కూడా కోర్టు ఈ రోజే విచారించనుంది. ఈ నేపధ్యంలో పలువురు అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.