మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు రూ.2350 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని, జీవో ప్రకారం రీయంబర్స్ కింద ఇప్పటివరకు రూ.1740 కోట్ల నిధులను ప్రభుత్వం సంస్థకు విడుదల చేసిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ప్రతి రోజు సగటున 30 లక్షల మంది మహిళలను సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని వివరించారు. సిబ్బంది కష్టపడి చేయడం వల్ల త్వరలోనే సంస్థ బిలియన్ డాలర్ (రూ.8500 కోట్లు) టర్నోవర్ కార్పొరేషన్గా అవతరించబోతుందని తెలిపారు. ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్గా సంస్థ నిలిచిందని వివరించారు. మరోవైపు.. ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తూ తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా సంస్థ మార్చిందని అన్నారు. ప్రస్తుతం ప్రతి రోజు 1500 మంది ఉద్యోగులు ఓపీ సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు.
రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడికల్ ఫెసిలిటీ స్కీం సభ్యత్వం విస్తరింపు
రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడికల్ ఫెసిలిటీ స్కీం (REMFS) కింద లభించే ప్రయోజనాలను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంస్థ వర్తింపజేసింది. గతంలో ఉన్న నిబంధనల్లో మార్పు చేస్తూ కొత్త సర్కులర్‌ను సంస్థ జారీ చేసింది. ఈ మేరకు మార్పులు చేసిన సర్కులర్‌ను సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. మెడికల్ రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొందని బాధిత జీవిత భాగస్వాములూ ఈ స్కీం సభ్యత్వాన్ని పొంది ప్రయోజనాలను పొందనున్నారు. సీలింగ్ ప్రకారం సభ్యత్వం పొందిన లభ్ధిదారులు జీవిత కాలం వరకు వైద్య ఖర్చులకు రూ.4 లక్షల వరకు వినియోగించుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించింది.
తార్నాక ఆస్పత్రిలో ఫార్మసీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వైద్య పరీక్షా కేంద్రాల ప్రారంభం
హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో శనివారం ఉదయం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. తార్నక ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్యులతో మంత్రి సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తోన్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, తమ కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ వైద్య సేవలను అందించాలని డాక్టర్లకు సూచించారు. తార్నక ఆస్పత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని సదుపాయాలను సిబ్బంది వినియోగించుకోవాలన్నారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.