తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఘననీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే అదే స్థాయిలో పెరుగుతోంది. ఆపదమొక్కులు తీర్చే స్వామికి కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతోంది. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం రూ. 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ ఏడాది జనవరిలో రూ 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు, మార్చి నెలలో రూ 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ 101. 63 కోట్లు, మే నెలలో రూ 108.28 కోట్లు, జూన్ నెలలో రూ 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారికి వచ్చాయి.
ఇక, ఏడు నెలల క్రితం ఏడుకొండలవాడికి ఉన్న ఆస్తులు వివరాలను కూడా టిటిడి ప్రకటించింది. ఈ మేరకు 24 బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్ల వివరాల లెక్కలను టీటీడీ బయట పెట్టింది. ఈ లెక్కల ప్రకారం.. 2023 అక్టోబర్ 31 నాటికి రూ. 17,816.15 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఇక బంగారు డిపాజిట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి.
టిటిడి గోల్డ్ డిపాజిట్లు రెండు బ్యాంకుల్లో ఉన్నట్లు స్పష్టం చేసిన టిటిడి 2023 అక్టోబర్ 31 నాటికి 11,225.66 కేజీల బంగారం గోల్డ్ డిపాజిట్ లుగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10786.67 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 438.99 కేజీల గోల్డ్ ను టిటిడి డిపాజిట్ చేసింది.
కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. ఈరోజు బుధవారం, తొలి ఏకాదశి కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రూ.300 దర్శనానికి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.